టిక్ టాక్ వీడియోలు పోస్ట్ చేసిన యువతిని కాల్చి చంపేశారు... ఎక్కడ?
పశ్చిమ ఆఫ్రికా దేశాల్లో ఒకటైన మాలిలో దారుణం జరిగింది. సోషల్ మీడియాలో టిక్ టాక్ వీడియోలను పోస్ట్ చేసినందుకు ఓ యువతిని పట్టుకుని జిహాదీ ఉగ్రవాదులు కాల్చి చంపేశారు. మాలి దేశ సైన్యానికి గూఢచారిగా పని చేస్తుందన్న ఆరోపణలతో ఆ యువతిని కిడ్నాప్ చేసిన జిహాదీలు బహిరంగంగా కాల్చి చంపేశారు. ఈ ఘటన మాలి దేశ వ్యాప్తంగా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తమవుతోంది.
ఉత్తర మాలిలోని టింబక్టు ప్రాంతంలోని టోంకా నగరానికి చెందిన మరియమ్ సిస్సే అనే యువతి టిక్ టాక్‌లో స్థానిక విశేషాలపై వీడియోలు చేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆమెకు సుమారు 90 వేల మంది ఫాలోవర్లు ఉన్నారు. అయితే, గురువారం కొందరు జిహాదీలు ఆమెను అపహరించారు. మాలి సైన్యంకు తమ కదలికల గురించి ఆమె సమాచారం చేరవేస్తోందని ఆరోపించారు.
ఆ మరుసటి రోజే అంటే శుక్రవారం మరియమ్ ఒక మోటార్ బైకుపై టోంకా నగరంలోని ఇండిపెండెన్స్ స్క్వేర్ వద్దకు తీసుకొచ్చారు. అక్కడి జనసమూహం చూస్తుండగానే ఆమెను తుపాకీతో కాల్చి చంపారు. ఈ దారుణం జరుగుతున్నప్పడు మృతురాలి సోదరుడు కూడా గుమికూడిన జనంలో ఉడటం గమనార్హం.
ఈ ఘటనను ఓ భద్రతా అధికారి ధ్రువీకరించారు. "మాలి సైన్యం కోసం జిహాదీలను వీడియో తీస్తోందని ఆరోపిస్తూ మరియమ్ సిస్సేను బహిరంగంగా హత్య చేశారు. ఇది అత్యంత అనాగరికమైన చర్య" అని ఆయన పేర్కొన్నారు. స్థానిక అధికారులు కూడా ఈ హత్యను "నీచమైన చర్య"గా అభివర్ణిస్తూ తీవ్రంగా ఖండించారు.