1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 11 మే 2025 (11:40 IST)

ఛత్తీస్‌గడ్ టెన్త్ ఫలితాలు - టాప్ ర్యాంకర్‌కు బ్లడ్ కేన్సర్

Ishika Bala
తాజాగా ఛత్తీస్‌‍గఢ్ రాష్ట్రంలో పదో తరగతి పరీక్షా ఫలితాలు వెల్లడయ్యాయి. ఈ పరీక్షల ఫలితాల్లో అద్భుత ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచిన ఓ విద్యార్థిని, ప్రాణాంతక బ్లడ్ కేన్సన్‌తో పోరాడుతోంది. చదువులో అత్యుత్తమ ప్రతిభ చూపిన ఇషికా బాలా ప్రస్తుతం తన ప్రాణాలతో పోరాడుతోంది. ఆమె మెరుగైన చికిత్స కోసం ప్రభుత్వం సహాయం అందించాలని కుటుంబ సభ్యులు వేడుకుంటున్నారు.
 
కాంకేర్ జిల్లాకు చెందిన ఇషికా బాలా బ్లడ్ క్యాన్సర్ కారణంగా ఏదాది పాటు చదువుకు దూరమైంది. అయినప్పటికీ, మొక్కవోని ధైర్యంతో తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల నిరంతర ప్రోత్సాహంతో తిరిగి పుస్తకాలు పట్టింది. అనారోగ్యంతో బాధపడుతున్నప్పటికీ ఛత్తీస్‌గఢ్ సెకండరీ బోర్డు నిర్వహించిన పరీక్షల్లో 99.17 శాతం మార్కులు సాధించి అందరినీ ఆశ్చర్యపరిచింది. భవిష్యత్తులో ఐఏఎస్ అధికారి కావాలన్నదే తన ఆశయమని ఇషిక ధీమాగా చెబుతోంది.
 
ఇక తండ్రి శంకర్ ఒక సాధారణ రైతు. ఇప్పటికే తమ కుమార్తె చికిత్స నిమిత్తం ఆయన దాదాపు రూ.15 లక్షలకు పైగా వెచ్చించారు. ఆర్థికంగా చితికిపోయిన ఆ కుటుంబం తమ కుమార్తె ప్రాణాలు కాపాడుకునేందుకు దాతల సహాయం కోసం ఎదురుచూస్తోంది. ఈ విషయం తెలుసుకున్న జిల్లా విద్యాశాఖాధికారి అశోక్ కుమార్ పటేల్ స్పందించారు. 
 
ప్రధానమంత్రి స్వాస్థ్య సహాయత యోజన ద్వారా ఇషిక వైద్యానికి అవసరమైన తోడ్పాటును అందించేందుకు చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. ప్రభుత్వం నుంచి సకాలంలో సహాయం అంది, ఇషిక సంపూర్ణ ఆరోగ్యంతో తన లక్ష్యాన్ని చేరుకోవాలని పలువురు ఆకాంక్షిస్తున్నారు.