శోభనం రోజు భయంతో పారిపోయిన వరుడు... ఎక్కడ?
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఆసక్తికరమైన ఘటన ఒకటి చోటుచేసుకుంది. కొత్తగా పెళ్ళి చేసుకున్న వరుడు.. శోభనం రోజున మానసిక ఆందోళనతో పారిపోయాడు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు... మూడు రోజుల తర్వాత అతన్ని హరిద్వార్‌లో గుర్తించి అదుపులోకి కుటుంబ సభ్యులకు సురక్షితంగా అప్పగించారు. పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు...
యూపీ రాష్ట్రంలోని శారధన పోలీస్ స్టేషన్ పరిధిలో ఉంచాపుర్‌కు చెందిన మోను అనే 26 యేళ్ళ వ్యక్తి నంవబరు 27వ తేదీన రాత్రి అదృశ్యమయ్యాడు. విద్యుత్ బల్బు తీసుకొస్తాననే నెపంతో ఇంటి నుంచి బయటకు వెళ్లిన వరుడు తిరిగి రాకపోవడంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు.
దీంతో సీసీటీవీ ఫుటేజీలు పరిశీలించగా రాత్రి గంగా నదీ ఒడ్డున తిరుగుతూ కనిపించడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. ఈ క్రమంలో ఎంత వెతికినా అతడి జాడ కనబడలేదు. సోమవారం వేరొకరి ఫోన్ నుంచి మోను తన తండ్రికి కాల్ చేసి తాను సురక్షితంగానే ఉన్నానని, ఇంటికి తిరిగి రావాలనుకుంటున్నట్లు చెప్పాడు.
దీంతో అతడి తండ్రి, బంధువులతో కలిసి మేరఠ్ పోలీసులు హరిద్వార్ వెళ్లి రైల్వే స్టేషన్ సమీపంలో మోనును గుర్తించారు. అనంతరం పోలీసులు అతడిని ప్రశ్నించగా.. పెళ్లి రోజు రాత్రి భయాందోళనకు గురై హరిద్వార్ బస్సు ఎక్కానని, అక్కడే స్టేషన్ ప్రాంతంలో తిరుగుతూ గడిపినట్లు చెప్పాడు.
అయితే, వివాహం జరిగిన రోజే స్నేహితుల కోరిక మేరకు అతడు ఏదో తిన్నాడని పోలీసులు చెబుతున్నారు. స్నేహితుల సలహాతో ఆరోజు ఒకరకమైన మెడిసిన్ తీసుకొని ఉండొచ్చని, దాని ప్రభావం వల్లే మానసిక అశాంతికి గురై ఉంటాడని భావిస్తున్నారు. విచారణ అనంతరం మోనును కుటుంబ సభ్యులకు సురక్షితంగా అప్పగించినట్లు పోలీసు అధికారి అశుతోష్ వెల్లడించారు.