అయోధ్యలో భారీ పేలుడు.. భవనం కూలి ఐదుగురు దుర్మరణం
అయోధ్య నగరంలో భారీ పేలుడు సంభవించింది. ఈ పేలుడు శబ్దానికి భవనం ఒకటి
కూలిపోయింది. ఈ ఘటనలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. అయోధ్యకు సమీపంలోని ఓ గ్రామంలో ఇది జరిగింది. ఈ దుర్ఘటనలో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. శిథిలాల కింద మరికొందరు చిక్కుకొని ఉండొచ్చని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న జిల్లా యంత్రాగం పోలీసులు, అగ్నిమాపకదళం సహాయంతో సహాయక చర్యలు చేపట్టింది. జిల్లా కలెక్టర్ నిఖిల్ టికారామ్ ఫుండే, ఎస్పీ ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. క్షతగాత్రులను వెంటనే సమీపంలోని జిల్లా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం సహాయక బృందాలు శిథిలాలను తొలగించే పనిలో నిమగ్నమయ్యాయి.
పేలుడుకు గల కారణాలు తెలియాల్సివుంది. తొలుత బాణాసంచా పేలుడు వల్ల ఈ ప్రమాదం జరిగి ఉంటుందని భావించినా, పోలీసులు గ్యాస్ సిలిండర్ పేలుడే కారణమై ఉండవచ్చని అనుమానిస్తున్నారు. "వంటగదిలో గ్యాస్ సిలిండర్ లేదా కుక్కర్ పేలినట్లుగా ప్రాథమికంగా తెలుస్తోంది. అయితే, ఫోరెన్సిక్ పరీక్షల నివేదిక వచ్చిన తర్వాతే ఖచ్చితమైన కారణం చెప్పగలం" అని కలెక్టర్ నిఖిల్ టికారామ్ ఫుండే మీడియాకు తెలిపారు.
మరోవైపు, ఈ పేలుడు ఘటనపై సీఎం యోగి ఆదిత్యనాథ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సహాయక చర్యలను వేగవంతం చేయాలని, గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని ఉన్నతాధికారులను ఆదేశించారు.