జాతకం ప్రకారం నాకు ఇద్దరు భార్యలు .. రెండో భార్యవు నీవేనంటూ విద్యార్థినికి టీచర్ వేధింపులు...!!
బాలికను వేధింపులకు గురిచేసిన ఉపాధ్యాయుడు! జాతకం ప్రకారం తనకు ఇద్దరు భార్యలు ఉన్నారని, అందువల్ల రెండో భార్యగా నిన్నే పెళ్లి చేసుకుంటానంటూ వేధించసాగాడు. ఈ వేధింపులను భరించలేని ఆ విద్యార్థిని తల్లిదండ్రులకు సమాచారం చేరవేయడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసి ఆ కీచక టీచర్‌ను అరెస్టు చేశారు. ఈ వివరాలను పరిశీలిస్తే,
బోరనాడ ప్రాంతానికి చెందిన ఓ బాలిక స్థానికంగా ఉండే ఓ పాఠశాలలో తొమ్మిదో తరగతి విద్యాభ్యాసం చేస్తోంది. ఆ పాఠశాలలో దల్పత్ గార్గ్ అనే ఉపాధ్యాయుడు ఇంగ్లీష్ పాఠ్యాంశాన్ని బోధిస్తున్నాడు. ఈ ఉపాధ్యాయుడే బాలికను లైంగికంగా వేధించసాగాడు. తన జాతకం ప్రకారం ఇద్దరు భార్యలు ఉన్నారని, నిన్ను రెండో పెళ్ళి చేసుకుంటానంటూ వేధించసాగాడు.
ఈ విషయాన్ని ఆ చిన్నారి తమ తల్లిదండ్రులకు చెప్పడంతో ప్రిన్సిపాల్‌కు ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత సంబంధిత సీసీ టీవీ ఫుటేజీలతో పాటు నివేదికను ఉన్నతాధికారులకు పంపగా సదరు ఉపాధ్యాయుడుని ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. ఆ తర్వాత ఉపాధ్యాయుడుపై ఇచ్చిన ఫిర్యాదును ఉపసంహరించుకోవాలని ఒత్తిడి చేస్తున్న వారిపై కూడా పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో సదరు ఉపాధ్యాయుడుపై పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.