శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 31 డిశెంబరు 2024 (09:57 IST)

కేరళ ఓ మినీ పాకిస్థాన్.. కేరళీయులంతా ఉగ్రవాదులే : మహారాష్ట్ర మంత్రి నితీశ్ రాణే

nitish rane
మహారాష్ట్రలోని మహాయుతి ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న నితీశ్ రాణే చేసిన వ్యాఖ్యలు ఇపుడు పెను దుమారాన్ని రేపుతున్నాయి. కేరళ ఓ మినీ పాకిస్థాన్ అని, ఆ రాష్ట్ర ప్రజలంతా ఉగ్రవాదులని వ్యాఖ్యానిచారు. వీరంతా కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీలకు ఓట్లు వేసి గెలిపించారంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు ఇపుడు దేశ వ్యాప్తంగా పెను దుమారాన్ని రేపుతున్నాయి. 
 
కాగా, కేరళలోని వాయినాడ్ లోక్‌సభ స్థానం నుంచి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ఆ తర్వాత ప్రియాంక గాంధీ విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో వీరి విజయాలపై మహారాష్ట్ర మంత్రి నితీశ్ రాణే ఈ తరహా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కేరళ మినీ పాకిస్థాన్. అక్కడ ఉగ్రవాదులంతా రాహుల్, ప్రియాంకలకు ఓట్లు వేశారు. అందుకే వారిద్దరూ గెలిచారు అంటూ కామెంట్స్ చేశారు. నితీశ్ రాణే వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి.
 
ప్రతిపక్షాలు నితీశ్ రాణే వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నాయి. రాజ్యాంగంపై ప్రమాణం చేసిన మంత్రి ఈ రకమైన వ్యాఖ్యలు చేయడం ఏమిటని కాంగ్రెస్ నిలదీస్తోంది. ఆతనికి మంత్రి పదవిలో ఉండే అర్హత లేదని, తక్షణమే మంత్రివర్గం నుంచి సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ తొలగించాలని డిమాండ్ చేసింది. దీంతో నితీశ్ రాణే స్పందిస్తూ.. కేరళలో లవ్ జిహాదీ, మత మార్పిడుల ఘటనల కారణంగా తాను పాకిస్థాన్‌తో పోల్చినట్లు వివరణ ఇచ్చారు.
 
కాగా, నితీశ్ రాణే ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం ఇది తొలిసారి కాదు. ఆరంభం నుంచి వివాదాస్పద, రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తూ మంచి పాపులర్ అయ్యారు. సెప్టెంబరు నెలలో ముస్లింలను కొడతానంటూ బెదిరిస్తూ చేసిన ప్రసంగంపై పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు. అలాగే ఆయనపై శివసేన ఎంపీ సంజయ్ రౌత్ పరువు నష్టం దావా కూడా వేశారు. కేంద్ర మాజీ మంత్రి నారాయణ రాణే వారసుడిగా రాజకీయాల్లోకి నితీశ్ రాణే వచ్చారు.