తల్లి స్థానం దేవుడి కంటే గొప్పది : ప్రధాని నరేంద్ర మోడీ
తల్లి స్థానం దేవుడి కంటే గొప్పదని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. భౌతికంగా మన మధ్య లేని తన తల్లి హీరా బెన్ మోడీని కొందరు అనుచిత వ్యాఖ్యలు చేశారని మోడీ భావోద్వేగంతో స్పందించారు. అది కేవలం తన తల్లికి జరిగిన అవమానంమ మాత్రమే కాదని, దేశంలోని కోట్లాది మంది తల్లులు, సోదరీమణులను కించపరచడమేనని ఆయన ఆవేదన వ్యక్తం చేసింది. బీహార్‌లో ఇటీవలి కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ నిర్వహించిన ఓ ర్యాలీలో ఈ వ్యాఖ్యలు చేసినట్టు బీజేపీ ఆరోపించింది.
మంగళవారం నాడు బీహార్‌కు చెందిన సుమారు 20 లక్షల మంది మహిళలతో వర్చువల్ సమావేశంలో ప్రధాని మోడీ మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్, ఆర్జేడీ నేతలు పాల్గొన్న సభలో నా తల్లిని దూషించారు. ఆ మాటలు నన్ను తీవ్రంగా బాధించాయి. బీహార్ ప్రజలు కూడా ఈ వ్యాఖ్యలతో బాధపడ్డారని నాకు తెలుసు అని అన్నారు.
తన తల్లి పడిన కష్టాలను గుర్తు చేసుకుంటూ.. మా బట్టల కోసం ప్రతి పైసా కూడబెట్టేది. అనారోగ్యంతో ఉన్నా పనిచేసి కుటుంబాన్ని పోషించేది. దేశంలో అలాంటి తల్లులు కోట్లాది మంది ఉన్నారు. తల్లి స్థానం దేవుడి కంటే గొప్పది అని మోడీ ఉద్వేగానికి లోనయ్యారు. కాగా, మోడీ తల్లిపై వ్యాఖ్యల పట్ల బీజేపీ నేతు పాట్నాలోని కొత్వాలి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, పోలీసులు ఒక వ్యక్తిని అరెస్టు చేసిన విషయం తెల్సిందే.