శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్

ప్రధాని మోడీ భద్రతా వలయంలో లేడీ కమాండో...!!

woman commando
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ భద్రతా వలయంలో ఓ లేడీ కమాండో కనిపించి ప్రతి ఒక్కరినీ ఆశ్చర్యానికి గురిచేశారు. గత పదేళ్లుగా ఏనాడూ ఒక్క లేడీ కమాండ్ కనిపించిన దాఖలాలు లేవు. ఇపుడు ఆకస్మికంగా ఓ మహిళా కమాండ్ ప్రత్యక్షమయ్యారు. దీనిపై ప్రస్తుతం నెట్టింట చర్చ సాగుతుంది. బీజేపీ ఎంపీ, బాలీవుడ్ నటి కంగనా రనౌత్ షేర్ చేసిన ఓ ఫొటోనే ఇందుకు నిదర్శనంగా ఉంది. 
 
పార్లమెంట్ వద్ద ప్రధాని నడిచి వెళుతుండగా ఆయన వెనక ఓ మహిళా భద్రతా సిబ్బంది కనిపించారు. ఈ చిత్రాన్ని కంగనా రనౌత్ తన ఇన్‌స్టచాగ్రామ్‌లో స్టోరీస్‌లో పంచుకున్నారు. దీంతో ఈ ఫొటో కాస్తా వైరల్‌గా మారింది. దీనికి కంగనా ఎలాంటి క్యాప్షన్ రాయనప్పటికీ.. ఆమె ప్రధాని భద్రతా బృందం అయిన స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్‌లో సభ్యురాలే అయి ఉండొచ్చని నెటిజన్లు భావిస్తూ, కామెంట్స్ చేస్తున్నారు. 
 
దీంతో ప్రధాని భద్రతలో మహిళా కమాండో ఉన్నారనే వార్త చక్కర్లు కొడుతోంది. దీనిపై భద్రతా వర్గాలు స్పందించాయి. కొందరు మహిళా ఎస్పీజీ కమాండోలు 'క్లోజ్ ప్రొటెక్షన్ టీమ్'లో సభ్యులుగా ఉన్నట్లు తెలిపాయి. అయితే, ఈ చిత్రంలో కన్పించిన మహిళ మాత్రం ఎస్పీజీ బృందంలో భాగం కాదని స్పష్టంచేశాయి. ఆమె రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు కేటాయించిన పర్సనల్ సెక్యూరిటీ ఆఫీసర్ అని తెలిపాయి. సెంట్రల్ రిజర్వ్ పోలీసు ఫోర్స్‌లో అసిస్టెంట్ కమాండెంట్‌గా వ్యవహరిస్తున్నారని పేర్కొన్నాయి. అయితే, ఆమె పేరు, ఇతర వివరాలను మాత్రం అధికారిక వర్గాలు పంచుకోలేదు.