మంగళవారం, 19 ఆగస్టు 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 18 ఆగస్టు 2025 (17:57 IST)

ముంబైలో వినాయకుడి మండపానికి రూ.474 కోట్ల బీమా

lord ganesh
గణేష్ వేడుకల్లో భాగంగా, దేశ వ్యాప్తంగా గణపతి నవరాత్రి ఉత్సవాలకు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. అనేక రాష్ట్రాల్లో వివిధ ఆకృతుల్లో కొలువుదీరే వినాయకుల కోసం మండపాలు సిద్ధమవుతున్నాయి. ఇందులో అత్యంత ఖరీదైన గణేశమూర్తులు, భారీ సెట్టింగులతో తాత్కాలిక మండపాలు రెఢీ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ముంబైలోని ఓ గణేశ్‌ మండపానికి ఏకంగా రూ.474.46 కోట్లకు బీమా చేయించినట్టు ఓ జాతీయ మీడియా కథనం పేర్కొంది. 
 
ముంబై మహానగరంలోని మతుంగా ప్రాంతంలో గత ఏడు దశాబ్దాలుగా జీఎస్‌బీ సేవామండల్‌ వినాయక చవితి వేడుకలను ప్రత్యేకంగా నిర్వహిస్తోంది. ఈసారి 71వ వార్షికోత్సవం జరగనుంది. దేశంలోనే సంపన్న వినాయకుడుగా పేరొందిన ఈ విఘ్నేశ్వరుడి వేడుకలకు ఈ ఏడాది ఏకంగా రూ.474.46 కోట్లకు బీమా చేయించినట్టు ఆ కథనం పేర్కొంది. ఇక్కడ ప్రతిష్టించే గణేశ విగ్రహాన్ని భారీఎత్తున బంగారం, వెండి ఆభరణాలతో అలంకరించనుండటమే అందుక్కారణం. 
 
గతేడాది సైతం ఈ గణేశ్‌ మండపానికి రూ.400.58 కోట్లకు బీమా చేయించినట్లు నిర్వాహకులు మీడియాకు వెల్లడించారు. ప్రస్తుతం పూజారులు, నిర్వాహకులు, సహాయకులు, భద్రతా సిబ్బందికి రూ.375 కోట్లకు వ్యక్తిగత ప్రమాద బీమా తీసుకున్నారు. గణపయ్యకు అలంకరించే బంగారం, వెండి, ఆభరణాలకు రూ.67 కోట్ల బీమా వర్తించనుంది. 2023, 2024ల్లో ఆ మొత్తం రూ.38 కోట్లు, రూ.43 కోట్లుగా ఉంది.
 
అగ్నిప్రమాదం, భూకంపం ముప్పు వంటి వాటికోసం ప్రత్యేకంగా మరో రెండు కోట్ల రూపాయల బీమా తీసుకున్నారు. అక్కడి ఫర్నీచర్‌, కంప్యూటర్లు, సీసీటీవీలు, స్కానర్లు ఇన్సూరెన్స్ పరిధిలో ఉన్నాయి. పబ్లిక్ లయబిలిటీ ఇన్సూరెన్స్ కింద రూ.30 కోట్లు కేటాయించారు. భక్తుల సౌలభ్యం కోసం క్యూఆర్‌ కోడ్, డిజిటల్ లైవ్ సేవలను కూడా నిర్వాహకులు అందుబాటులోకి తెచ్చారు. భద్రతా చర్యల్లో భాగంగా ఫేషియల్‌ రికగ్నిషన్‌ కెమెరాలను కూడా ఏర్పాటుచేశారు.