శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By వరుణ్
Last Updated : శుక్రవారం, 2 ఆగస్టు 2024 (10:37 IST)

వయనాడ్‌లో 308కి పెరిగిన మృతుల సంఖ్య - వయనాడ్ విలయాన్ని రికార్డు చేసిన ఇస్రో

isro satilite
కేరళ రాష్ట్రంలోని వయనాడ్‌లో సంభవించిన ప్రకృతి విపత్తులో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య అంతకంతకూ పెరిగిపోతుంది. గురువారం ఈ సంఖ్య 256గా ఉంటే శుక్రవారం ఉదయానికి ఈ సంఖ్య 308కి చేరింది. మృతుల్లో 25 మంది చిన్నారులు, 70 మంది మహిళలు ఉన్నారు. మరో 200 మంది ఆచూకీ తెలియాల్సివుంది. భారీ వర్షాలకు కొండ చరియలు విరిగిపడిన మండక్కై, చూరామల్, అత్తమాల, నూల్పుజ తదితర ప్రాంతాల్లో దాదాపు 40 బృందాలు సహాయక చర్యలు చేపడుతున్నాయి. సైన్యం, నేవీ, ఎన్డీఆర్ఎఫ్, ఇతర సహాయక బృందాలు కూడా సహాయక చర్యల్లో నిమగ్నమయ్యాయి. ఈ బృందాలు ఇప్పటివరకు వందలాది మందిని రక్షించి సహాయక శిబిరాలకు తరలించారు. 
 
మరోవైపు, 'ల్యాండ్‌స్లైడ్‌ అట్లాస్‌ ఆఫ్‌ ఇండియా' 20 ఏళ్లుగా వయనాడ్‌ జిల్లాతో పాటు కేరళలోని ప్రమాదకరమైన ప్రాంతాలను డాక్యుమెంటరీ రూపంలో భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో చిత్రీకరిస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా వయనాడ్‌ జిల్లాలో సంభవించిన భారీ ప్రమాదాన్ని చిత్రీకరించింది. వయనాడ్‌లోని కొండచరియలు జారిపడిన దృశ్యాన్ని విలయానికి ముందు, తర్వాత చిత్రాలను ఆ ప్రాంతంపై దృష్టి సారించిన కార్టోశాట్‌-3, ఆర్‌ఐఎస్‌ఏటీ ఉపగ్రహాలు రికార్డు చేశాయి. 
 
ఇస్రో అనుబంధ సంస్థ నేషనల్‌ రిమోట్‌ సెన్సింగ్‌ సెంటర్‌ (ఎన్‌ఆర్‌ఎస్‌సీ) అంతరిక్షం నుంచి తీసిన ఈ 3డీ చిత్రాలను విశ్లేషించింది. గతంలోనూ ఇదే ప్రాంతంలో కొండచరియలు జారిపడినట్లు ఇస్రో నివేదికలు వివరించాయి. తాజాగా రికార్డ్‌ అయిన చిత్రాల ప్రకారం సముద్రమట్టానికి 1,550 మీటర్ల ఎత్తు నుంచి కొండచరియలు విరిగిపడగా, ఈ ప్రభావంతో 86 వేల చదరపు మీటర్ల భూభాగం లోతట్టు ప్రాంతానికి జారిపడింది. ఈ శిథిలాలు పరిసరాల్లోని ఇరువంజిపుళ నదిలో దాదాపు 8 కిలోమీటర్ల దూరం వరకు వేగంగా కొట్టుకుపోగా, ఈ ధాటికి నది ఒడ్డు భాగం ఒరుసుకుపోయినట్లు ఈ నివేదికలు వెల్లడించాయి. 
 
విలయం తర్వాత రికార్డయిన 3డీ చిత్రంలో గుర్తించిన కిరీటం వంటి ప్రాంతమంతా భారీ వర్షానికి విరిగిపడినట్లు ఇస్రో విశ్లేషించింది. ల్యాండ్‌స్లైడ్‌ అట్లాస్‌ ఆఫ్‌ ఇండియా ఇప్పటి వరకు 80 వేలకు పైగా కొండచరియలు విరిగిపడిన దృశ్యాలను రికార్డు చేయగా 2023లోనే ప్రస్తుతం సంభవించిన ప్రమాదాన్ని అంచనా వేసింది. ఈ నివేదికలు కేవలం కేరళలోనే కాదు, దేశంలో ఏ ప్రాంతంలోనైనా ప్రకృతి విపత్తును గుర్తించేందుకు ఉపయోడపడుతుందని ఇస్రో చైర్మన్‌ డాక్టర్‌ ఎస్‌.సోమనాథ్‌ గతంలోనే వెల్లడించిన విషయాన్ని ఇస్రో గుర్తు చేసింది.