Karthika Masam: కార్తీక మాసం ప్రారంభం.. దీపారాధన, దీపదానం.. బిల్వార్చన చేస్తే?
అక్టోబర్ 22వ తేదీ నుంచి శివారాధనకు విశిష్టమైన కార్తీక మాసం 2025 ప్రారంభమవుతుంది. నవంబర్ 20 వరకు కార్తీక మాసం ఉంటుంది. ఈ నెలలో పరమేశ్వరుడిని విశేషమైన భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తారు. ఈ మాసం ఎంతో విశిష్టమైనదని స్కంధ పురాణంలో పేర్కొన్నారు.
ఈ మాసమంతా పూజలు, వ్రతాలు, ఉపవాసాలు, వనభోజనాలు ఇలా భక్తిపారవశ్యంతో మునిగిపోతుంది. దేశం నలుమూలలా ఉన్న ప్రముఖ ఆలయాల్లో రుద్రాభిషేకాలు, రుద్రపూజ, లక్ష బిల్వదళ పూజలు, అమ్మవారికి లక్ష కుంకుమార్చనలు ఇలా విశేషంగా ఆచరిస్తూ ఉంటారు.
కార్తీక మాసంలో బిల్వ పత్రాలతో శివుడిని పూజించడం వల్ల స్వర్గ లోక ప్రాప్తి కలుగుతుందని.. ఇక మరుజన్మ ఉండదని భక్తులు విశ్వసిస్తారు. ఈ కార్తీక మాసంలో పవిత్ర నదిలో లేదా పవిత్ర జలంతో బ్రహ్మ ముహూర్తంలో స్నానం చేయడం ఎంతో విశిష్టత కలిగి ఉంటుంది.
ఈ పవిత్రమైన పుణ్యమాసంలో మహిళలు ఉదయాన్నే నిద్రలేచి స్నానం ఆచరిస్తారు. అనంతరం దీపారాధన చేస్తారు. కార్తీక మాసంలో దీప దానానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ మాసంలో పవిత్ర నది లేదా ఆలయం లేదా ఇంట్లో తులసి దగ్గర ప్రతి రోజూ దీపం దానం చేయడం చాలా ప్రాముఖ్యత కలిగి ఉంటుంది.
ఈ కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమి వేళ 365 ఒత్తులతో దీపారాధన చేసి ఆ పరమేశ్వరుడిని దర్శించుకుంటారు. పున్నమి వెలుగుల్లో కార్తీక దీపాలను వెలిగించి నదుల్లో, పారే నీటిలో వదులుతారు. సోమవారాలు కఠిన ఉసవాస దీక్షను ఆచరిస్తారు.