Atla Taddi : అట్లతద్ది.. పదేళ్లు చేయాలట... గౌరీదేవిని ఇలా పూజిస్తే..?
అట్లతద్ది ప్రతి ఏడాది ఆశ్వయుజ మాసం బహుళ కృష్ణ పక్షంలోని తదియ తిథిరోజున జరుపుకుంటారు. ఈ ఏడాది ఈ తదియ తిథి అక్టోబర్ 9 వ తేదీ గురువారం వచ్చింది. గౌరీ దేవిని చంద్రుడిని పూజిస్తారు. పెళ్లి కాని యువకులు మంచి జీవిత భాగస్వామి రావాలని.. పెళ్ళైన స్త్రీలు భర్త దీర్ఘాయుష్షు, ఆయురారోగ్యాలతో జీవించాలని ఈ నోముని జరుపుకుంటారు. పూజలో కలశం పెడతారు.
పసుపుతో గౌరీదేవిని, గణపతిని చేసి పూజ చేస్తారు. చేతులకు చామంతి, తులసిదళం, తమలపాకు మొదలైన పుష్పాలు, పత్రాలతో 11 ముడులు వేసి కట్టిన తోరాలు కట్టుకుంటారు. ఒక పళ్ళెంలో బియ్యం పోసి.. బియ్యంపిండితో చేసిన కుడుముల పెట్టి.. అందులో పసుపు కుంకుమలు వేస్తారు.
పుష్పాలతో అలంకరిస్తారు. దీనిని కైలాసంగా భావిస్తారు. ముందుగా గణపతికి పూజ చేసి తర్వాత లలితా సహస్రనామం, గౌరీ అష్టోత్తరం చదివి.. అనతరం అట్లతద్ది వ్రత కథ చదువుతారు. ఒక్కొక్కరికీ 11 అట్లు చొప్పున .. గౌరీదేవివద్ద పెట్టిన కుడుముల్లోంచి ఒక్కొక్కరికి ఒక్కొకటి పెట్టి, తాంబూలంతో వాయనం ఇస్తారు.
అట్లతద్ది నోములో వాయనం అందుకున్న స్త్రీలు.. ఆ అట్లను వాళ్ళు లేదా వారి కుటుంబీకులు మాత్రమే తినాలి. వాయనంలో జాకెటు బట్ట ఇస్తారు. శక్తి ఉన్నవారు చీరలు పెడతారు.
ఆశ్వయుజ బహుళ తదియ రోజున అర్ధరాత్రి నాలుగవ జామునే నిద్రలేచి శుచిగా స్నానమాచరించి... చుక్క ఉన్న సమయంలోనే భోజనం చేసి.. అప్పటి నుంచి ఆ రోజు రాత్రి చంద్రోదయం అయ్యేవరకు కటిక ఉపవాసం ఉండాలి. గౌరీదేవికి పది అట్లు నైవేద్యం పెట్టి ఒక ముత్తయిదువుకు పదట్లు వాయనం ఇచ్చి కథ చెప్పుకొని అక్షతలు వేసుకోవాలి. తర్వాత భోజనం చేయాలి.
ఇలా పది సంవత్సరాలు చేసుకుని తదుపరి ఏడాది ఉద్యాపన చేసుకోవాలి. ఈ వ్రతాన్ని ఆచరించడం ద్వారా కుజ దోషాలు తొలగిపోతాయని.. నవగ్రహాల్లో కుజునికి అట్లు అంటే ఇష్టమని.. ఆయనను శాంతిపరిచే దిశగా అట్లతద్ది చేసుకుంటారని నమ్మకం. ఇంకా ఈ నోము ఉమామహేశ్వరుల పూజ కావడంతో సౌభాగ్యం సిద్ధిస్తుంది.