శుక్రవారం, 10 జనవరి 2025
  1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. వార్తలు
Written By వరుణ్

తమ నమ్మకాన్ని భారత అథ్లెట్లు వమ్ము చేయరు : గగన్ నారంగ్

gagan narang
ప్యారిస్ వేదికగా జరిగే విశ్వక్రీడల్లో (ఒలింపిక్స్) భారత అథ్లెట్లు తమ నమ్మకాన్ని వమ్ము చేయరని చెఫ్ ది మిషన్ గగన్ నారంగ్ అన్నారు. ఈ క్రీడా పోటీల్లో పాల్గొనే భారత బృందానికి నారంగ్ నాయకత్వం వహిస్తున్న విషయం తెల్సిందే. ఈ క్రీడా పోటీల్లో పాల్గొంటున్న భారత ఆత్మస్థైర్య, ఆలోచన తీరుపై ఆయన స్పందిస్తూ, గతంతో పోలిస్తే భారత అథ్లెట్ల ఆలోచనా తీరు పూర్తిగా మారిపోయిందన్నారు. తాము కూడా వారిని బంగారు పతకం సాధించేలా ప్రోత్సహిస్తున్నట్టు తెలిపారు. 
 
'ఇప్పుడు మన అథ్లెట్లకు అందుతున్న ప్రోత్సాహంలో చాలా మార్పు వచ్చింది. వారి ఆలోచనా విధానం కూడా ఉన్నతస్థాయికి చేరుకుంది. గతంలో ఒలింపిక్స్ అనగానే చాలా ఆందోళనకు గురయ్యేవాళ్లం. ఇతర దేశాలతో పోలిస్తే ఆత్మవిశ్వాసం తక్కువగా ఉండేది. కానీ, ఇప్పుడు మాత్రం మైండ్సెట్ మారింది. వారికి పోటీ ఇచ్చేలా సమాయత్తం కావడం కలిసొచ్చే అంశం. ప్రజలు కూడా క్రీడలను ఆస్వాదించడం మొదలు పెట్టారు. వారి కోసమైనా గొప్ప ప్రదర్శన ఇవ్వడానికి అథ్లెట్లు ప్రయత్నిస్తున్నారు. కేవలం గేమ్స్ పాల్గొనడమే తమ లక్ష్యంగా పెట్టుకోకుండా.. అత్యుత్తమ ప్రదర్శనతో పతకాలను సాధించేలా ముందడుగు వేశారు. ఎవరూ తమకంటే బెటర్ అని భావించడం లేదు. ఏదో ఒక పతకంతో సంతృప్తి చెందకుండా గోల్డ్ కొట్టడమే లక్ష్యంగా పెట్టుకొన్నారు.
 
కేంద్రం నుంచి కూడా క్రీడాకారులకు ఇప్పుడు దక్కుతున్న ప్రోత్సాహం గతంలో ఎప్పుడూ చూడలేదు. గత కొన్నేళ్లుగా మద్దతు పెరుగుతూ వచ్చింది. టాప్ ప్లేయర్లు పెరిగారు. ఎలాంటి సదుపాయాలు కావాలన్నా పొందగలుగుతున్నారు. కేంద్ర క్రీడా శాఖ, శాయ్, ఐఓఏ మధ్య సహకారం బాగుంది. అథ్లెట్లకు దక్కిన ప్రోత్సాహాన్ని పతకాలుగా మారుస్తారనే నమ్మకంతో ఉన్నా. నాలుగు ఒలింపిక్ పోటీల్లో అథ్లెట్లుగా పాల్గొన్న తాను ఈసారి బృందాన్ని నడిపించడం గౌరవంగా భావిస్తున్నా. ఇది ఎంతో బాధ్యతతో కూడుకున్నదే. ఒత్తిడిని తట్టుకొని అథ్లెట్లకు అండగా నిలుస్తా. ప్లేయర్‌గా ఒక విధమైన ఒత్తిడిని ఎదుర్కొన్న తనకు ఇది విభిన్నం. ప్రతి ఒక్కరిని సమన్వయం చేసుకుని ముందుకు సాగుతాం అని నారంగ్ తెలిపారు.