శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 21 ఆగస్టు 2024 (10:13 IST)

ఎందరో గొంతు చించుకుంటున్నా మహిళలపై ఘోరాలు ఆగడం లేదు : విజయశాంతి

Vijayashanti
తనలాంటి వారు ఎంతో మంది గొంతు చించుకుంటున్నప్పటికీ మహిళలపై జరుగుతున్న నేరాలు ఘోరాలు ఏమాత్రం ఆగడం లేదని సినీ నటి విజయశాంతి అన్నారు. కోల్‌కతా మెడికో హత్యాచార ఘటనపై ఆమె తన ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఎన్ని నిరసనలు చేసినా అత్యాచార ఘటనలు ఆగడం లేదంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. కుటుంబం, సమాజం, పోలీస్, న్యాయ వ్యవస్థ ఉన్నప్పటికీ చివరికి ఎన్‌కౌంటర్లు జరుగుతున్నా ఈ దారుణాలు ఆగడం లేదని వాపోయారు.
 
తప్పు ఎక్కడ జరుగుతోందన్న ప్రశ్న తన హృదయాన్ని తొలిచివేస్తోందన్నారు. అయితే, తాజాగా సుప్రీంకోర్టు స్పందించి ఈ కేసును సుమోటోగా స్వీకరించిందని దోషులకు ఖచ్చితంగా శిక్ష నమ్మకం ఉందన్నారు. నేర విచారణ, దోషులకు శిక్షకంటే ముందు అసలు ఇలాంటి దారుణాలకు పూర్తిగా బ్రేక్ పడాలనేదే తన బలమైన ఆకాంక్ష అని తెలిపారు. ఇలాంటి అంశాల్లో ప్రతిఘటన అవసరమని తన సినిమాలోని పాటను ట్వీట్‌కు జత చేశారు. 
 
'కోల్‌కతా వైద్య విద్యార్థిని హత్యాచార ఘటన జరిగి సుమారుగా 10 రోజులు దాటింది. సాధారణంగా ఇలాంటి ఘోరాలు జరిగినప్పుడల్లా నేను వెంటనే స్పందిస్తూ నా ఆక్రోశాన్ని, ఆవేదనను వెలిబుచ్చుతుంటాను. కోల్‌కతా ఘటన గురించి తెలిసిన వెంటనే సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టవచ్చు. కానీ, నాలాగా ఎందరు ఎంతగా ఎంత గొంతు చించుకున్నా, ఎందరెందరో ఎన్నెన్ని నిరసనలు చేసినా ఈ నేరాలు, ఘోరాలు ఎందుకు ఆగడం లేదనే ప్రశ్నకు సమాధానం కోసం అన్వేషిస్తూ గతంలో చోటు చేసుకున్న ఇలాంటి హత్యాచార ఘటనల పరిస్థితులు, పరిణామాలపై నాలో నేను సంఘర్షణ పడుతూ ఉన్నాను.
 
ఇంకా ఏం చేస్తే ఇలాంటి సంఘటనల్ని ఆపగలం? కుటుంబం, సమాజం, పోలీస్ వ్యవస్థ, న్యాయవ్యవస్థ ఇన్ని ఉన్నప్పటికీ.. తప్పో, ఒప్పో చివరికి ఎన్‌కౌంటర్లు జరుగుతున్నా ఈ దారుణాలు ఆగడం లేదు. తప్పు ఎక్కడ జరుగుతోందన్న ప్రశ్న నా హృదయాన్ని తొలిచివేస్తోంది. తాజాగా సుప్రీంకోర్టు స్పందించి ఈ కేసును సుమోటోగా స్వీకరించింది. విచారణ జరుగుతుంది. దోషులకు ఖచ్చితంగా శిక్ష పడుతుంది. నాకు న్యాయ వ్యవస్థ మీద నమ్మకం ఉంది. కానీ, దోషులకు శిక్షపడుతుంది కదా.. అని నేరాలను ఉపేక్షించం కదా? నేర విచారణ, దోషులకు శిక్షకంటే ముందు అసలు ఇలాంటి దారుణాలకు పూర్తిగా బ్రేక్ పడాలనేదే నా బలమైన ఆకాంక్ష. ఇందుకు ఇంకెంతకాలం నిరీక్షించాలో కదా అని విజయశాంతి తన ట్వీట్లో పేర్కొన్నారు.