శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By ఠాగూర్

కేసీఆర్ నాటిన కలుపు మొక్కలన్నింటినీ పీకిపడేస్తా : సీఎం రేవంత్ రెడ్డి

revanthreddy
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మాజీ ముఖ్యమంత్రి, భారత రాష్ట్ర సమితి కేసీఆర్ నాటిన కలుపు మొక్కలన్నింటనీ పీకిపడేస్తానని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. తెలంగాణాలో కాంగ్రెస్ పార్టీ పాలనకు వంద రోజులు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా మీట్ ది ప్రెస్ కార్యక్రమాన్ని సీఎం రేవంత్ రెడ్డి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన అనేక అంశాలపై స్పందించారు. గత యేడాది డిసెంబరు మూడో తేదీ తెలంగాణాకు విముక్తి కలిగిన రోజన్నారు. ప్రపంచం అబ్బురపడేలా తెలంగాణ ప్రజలు తీర్పునిచ్చారని తెలిపారు. 
 
టీఎస్ ఈఆర్సీ చైర్మన్ తన్నీరు శ్రీరంగారావుపై సీఎం రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు. ఇంటి పేరు తన్నీరు అయినంత మాత్రాన పన్నీరు కాలేరని చురక అంటించారు. కేసీఆర్ నాటిన కలుపు మొక్కలు ఇంకా కొన్ని ఉన్నాయని ఎత్తిపొడిచారు. కలుపు మొక్కలు అన్నింటినీ పీకి పారేస్తామని చెప్పారు. ఇలాంటి కలుపు మొక్కలను పీకిపారేయడానికి రోజుకు 18 గంటలు పనిచేస్తానని స్పష్టం చేశారు.
 
విద్యుత్ రెగ్యులేటరీ కమిషన్ నిన్న మాకు నోటీసులిచ్చింది... ముందుగా డబ్బు కట్టాకే జీరో విద్యుత్ బిల్లు ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొంది అని రేవంత్ రెడ్డి వివరించారు. రైతులకు ఉచిత విద్యుత్ ఇచ్చినప్పుడు ఈ ఆదేశం ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. ఇలాంటి తెలివితేటలు మానుకోవాలని హితవు పలికారు.
 
కేసీఆర్ ఆనవాళ్లు ఇంకా కొన్ని కనిపిస్తూనే ఉన్నాయని, కేసీఆర్ గంజాయి మొక్కలు ఇంకా వాసనలు వెదజల్లుతున్నాయని అన్నారు. అందుకే ఆ గంజాయి మొక్కలను పీకే పనిలో ఉన్నా... ఇప్పటికే కొన్ని గంజాయి మొక్కలు పీకాను... పీకాల్సిన గంజాయి మొక్కలు కొన్ని ఉన్నాయి... గంజాయి మొక్క అనేదే లేకుండా చేస్తా అని హెచ్చరించారు. తన్నీరు కూడా ఆ కుర్చీలో ఎక్కువ రోజులు ఉండరని స్పష్టం చేశారు. 
 
అలాగే, కేసీఆర్ పాలన నిజాం నవాబుల వంటి పాలన అని, సంక్షేమ పథకాలు అమలు చేసినా స్వేచ్ఛను హరిస్తే ప్రజలు ఊరుకోరన్న విషయం స్పష్టమైందని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. నాడు నిజాం కూడా సంక్షేమ పథకాలు అమలు చేశాడని, కానీ నిజాం ఎంత చేసినా సరే, తమకు స్వేచ్ఛ లేకుండా చేశాడని ప్రజలు తిరగబడ్డారని వివరించారు.
 
కేసీఆర్ కూడా అదేవిధంగా తన ఆధిపత్యాన్ని కొనసాగించాలని చూశారని, తన వారసులను సీఎం ఏచేయాలని చూశాడని రేవంత్ రెడ్డి విమర్శించారు. దాంతో కేసీఆర్ కుటుంబాన్ని ప్రజలు అధికారం నుంచి దింపారని వ్యాఖ్యానించారు. నిజాం తరహాలోనే కేసీఆర్ కూడా రాచరికాన్ని తీసుకురావాలని చూశారని, కేసీఆర్ పాలనలో తెలంగాణ నిర్బంధానికి గురైందని అన్నారు. ప్రజాస్వామ్యంపై కేసీఆర్‌కు నమ్మకం లేదని, ప్రజల స్వేచ్ఛకు ఏనాడూ విలువ ఇవ్వలేదని ఆరోపించారు.
 
ఇక, తమ పాలన ప్రజల అభీష్టం మేరకే సాగుతుందన్నారు. ప్రజాభిప్రాయాలకు విలువనిస్తామని రేవంత్ రెడ్డి చెప్పారు. ధర్నాలు ఎందుకు? ధర్నా చౌక్ వద్దు అన్న వారికి అక్కడ ధర్నా చేసేందుకు అనుమతి ఇచ్చామన్నారు. నియంతలు ఎప్పుడూ సంస్కృతిని ధ్వంసం చేయాలని చూస్తారని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.