శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: మంగళవారం, 15 అక్టోబరు 2024 (22:38 IST)

పాలపిట్టను పంజరంలో చెరబట్టిన కాంగ్రెస్ నాయకుడు జగ్గారెడ్డి, వన్యప్రాణి సంరక్షకులకు ఫిర్యాదు

Jaggareddy with Palapitta
దసరా పండుగ నాడు పాలపిట్టను చూస్తే పుణ్యం వస్తుందని, శుభం జరుగుతుందని విశ్వాసం. ఐతే పూర్వం పల్లెల్లు, పట్టణాలు అన్నీ వృక్షాలు, చెట్లతో నిండి వుండటం వల్ల పాలపిట్టలు అడపాదడపా దర్శనమిచ్చేవి. పండుగనాడు వాటిని చూసి తృప్తిపడేవారు. కానీ ఇప్పటి పరిస్థితి వేరు. ఎక్కడో సుదూర ప్రాంత అడవుల్లో ఇవి వుంటున్నాయి. దీనితో దసరా పండుగ నాడు పాలపిట్టలను చూడాలన్న ఆత్రుతలో కొంతమంది వాటిని పట్టుకుని తెస్తున్నారు. 
 
ఇదే పని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు జగ్గారెడ్డి కూడా చేసేసారు. దసరా పండుగ నాడు ఆయన పాలపిట్టను పంజరంలో బంధించి తెచ్చారు. వేడుకల్లో భాగంగా ఆ పంజరాన్ని అక్కడికి తీసుకుని వచ్చి అందులో వున్న పాలపిట్టను పట్టుకుని బైటకు తీసి ప్రజలకు బహిరంగంగా చూపిస్తూ అంతా చూడండి శుభం కలుగుతుందని చెప్పారు. ఐతే ఇలా చేసి ఆయన వివాదంలో చిక్కుకున్నారు.
 
వన్యప్రాణ సంరక్షణ చట్టం ప్రకారం పక్షులను పంజరంలో బంధించడం నేరం. పండుగ రోజున పాలపిట్టను వేధించారంటూ తెలంగాణ వైల్డ్ లైఫ్ చీఫ్ వార్డెన్ సుభద్రాదేవికి వన్యప్రాణ సంరక్షకులు ఫిర్యాదు చేసారు. మరి ఈ చట్టం ప్రకారం కాంగ్రెస్ నాయకుడు జగ్గారెడ్డిపై చర్యలు తీసుకుంటారేమోనని చెప్పుకుంటున్నారు.