ప్రేమ వ్యవహారంలో యువతి హత్య - పక్కనే కొన ఊపిరితో ప్రియుడి...
హైదరాబాద్ నగర శివారు ప్రాంతమైన రామచంద్రాపురం పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రేమ వ్యవహారం ఓ యువతి ప్రాణాలు తీసింది. ఆమె ప్రియుడు మాత్రం కొనఊపిరితో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అయితే, గొంతుపై కత్తిగాట్లతో పడివుండటం అనుమానాలను రేకత్తిస్తోంది.
తన ప్రియురాలిన హత్యచేసి.. ప్రియుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడా? లేదా ఇంకెవరైనా హత్య చేశారా అన్నది తెలియాల్సివుంది.
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ఏపీలోని విజయనగరం జిల్లా బాడంగి మండలం గజరాయునివలస గ్రామానికి చెందిన బొత్స శ్రీనివాస్, ఈశ్వరమ్మ దంపతులు 25 ఏళ్ల క్రితం ఉపాధి కోసం హైదరాబాద్ నగరానికి వచ్చారు.
రామచంద్రాపురం పరిధిలోని బండ్లగూడ బాలాజీనగర్ నివాసముంటూ స్థానికంగా ఓ పరిశ్రమలో పనిచేస్తున్నారు. వీరి కుమార్తె రమ్య (23)కు మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం మాణెపల్లికి చెందిన ప్రవీణ్ కుమార్ (25)తో మూడేళ్ల నుంచి పరిచయముంది.
బీటెక్ పూర్తి చేసిన ప్రవీణ్ ప్రస్తుతం ఆల్విన్ కాలనీలో ఉంటూ ట్యూషన్లు చెబుతున్నాడు. ఇద్దరి మధ్య పరిచయం ప్రేమగా మారింది. ఆరు నెలల క్రితం తమ ప్రేమ గురించి యువకుడు... రమ్య తల్లిదండ్రులకు చెప్పగా.. వారు అంగీకరించలేదు.
ఆమెకు పెళ్లి సంబంధాలు చూడడం మొదలుపెట్టారు.
ఈ క్రమంలో సోమవారం మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో యువతి తల్లి ఈశ్వరమ్మ ఇంటికి వచ్చేసరికి లోపలి నుంచి గడియ పెట్టి ఉంది. కిటికీలోంచి పరిశీలించగా రమ్య గొంతుపై తీవ్ర గాయంతో రక్తపు మడుగులో ఉంది. ఆ పక్కనే మెడమీద గాయంతో ప్రవీణ్ పడి ఉన్నాడు. స్థానికుల సాయంతో లోపలికి వెళ్లి చూడగా రమ్య మృతి చెందింది. ప్రవీణ్ కొన ఊపిరితో ఉండడంతో 108 వాహనంలో ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతనికి చికిత్స అందుతోంది.