బుధవారం, 15 అక్టోబరు 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By ఠాగూర్

సంగారెడ్డిలో విషాదం - పోలియో చుక్కలు వేసిన చిన్నారి మృతి

polio drop
తెలంగాణ రాష్ట్రంలోని సంగారెడ్డిలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. పోలియో చుక్కలు వేసిన కొద్దిసేపటికే ఓ మగ శిశువు మృతి చెందాడు. ఇది స్థానికంగా కలకలం రేపింది. పోలియో చుక్కలు వికటించడం వల్లే తమ బిడ్డ ప్రాణాలు కోల్పోయాడని తల్లిదండ్రులు ఆరోపిస్తుండగా, అది నిజం కాదని వైద్యులు, స్థానిక ఎమ్మెల్యే స్పష్టం చేస్తున్నారు.
 
జిల్లాలోని కంగ్జీ మండలం భీంరా గ్రామానికి చెందిన సర్కుదొ దొడ్డి ఉమాకాంత్, స్వర్ణలత దంపతులకు ముగ్గురు కుమార్తెలు, మూడు నెలల కుమారుడు ఉన్నారు. ఆదివారం తల్లి స్వర్ణలత తన పిల్లలందరినీ స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లి పోలియో చుక్కలు వేయించారు. పోలియో డ్రాప్స్ వేసిన తర్వాత బాబు ఏడుస్తుండటంతో, స్వర్ణలత పాలు పట్టేందుకు ప్రయత్నించింది. అదేసమయంలో పసికందు ప్రాణాలు విడిచాడు.
 
పోలియో చుక్కల వల్లే తమ కుమారుడు మరణించాడని ఆరోపిస్తూ తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నారాయణఖేడ్ ఆసుపత్రికి తరలించారు. 
 
ఈ ఘటనపై పీహెచ్సీ వైద్యాధికారి నాగమణి స్పందిస్తూ "శిశువుకు వాడిన సీసా నుంచే మరో 17 మంది పిల్లలకు పోలియో చుక్కలు వేశాం. చిన్నారి ముగ్గురు అక్కలకు కూడా అవే చుక్కలు వేశాం. ఎవరికీ ఎలాంటి సమస్యా రాలేదు. అసలు కారణం పోస్టుమార్టం నివేదికలో తెలుస్తుంది" అని వివరించారు.
 
ఈ విషయంపై నారాయణఖేడ్ ఎమ్మెల్యే సంజీవరెడ్డి కూడా స్పందించారు. శిశువు మృతికి పోలియో చుక్కలు గానీ, వైద్యుల నిర్లక్ష్యం గానీ కారణం కాదని ఆయన తెలిపారు. "వైద్యాధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నాను. పోలియో చుక్కలు వేసిన తర్వాత తల్లి పాలు పట్టడంతో బాబు వాంతి చేసుకున్నాడు. ఆ వాంతి గొంతులో అడ్డుపడటం (పొలమారడం) వల్లే దురదృష్టవశాత్తు మృతి చెందాడు" అని ఎమ్మెల్యే వివరణ ఇచ్చారు. ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.