మంగళవారం, 9 సెప్టెంబరు 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 1 సెప్టెంబరు 2025 (20:10 IST)

బంగారం దొంగిలించి క్రికెట్ బెట్టింగులు : సూత్రధారులు బ్యాంకు క్యాషియర్.. మేనేజరే...

gold
కంచె చేను మేసిన చందంగా ఓ బ్యాంకు క్యాషియర్, ఆ బ్యాంకు మేనేజరు, మరికొందరు సిబ్బంది కలిసి ఖాతాదారులకు చెందిన బంగారాన్ని కుదువపెట్టి భారీ కుంభకోణానికి పాల్పడిన సంఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. ఖాతాదారులు కుదువ పెట్టిన బంగారాన్ని దొంగిలించి దాన్ని కుదువపెట్టి తద్వారా వచ్చిన సొమ్ముతో క్రికెట్ బెట్టింగులకు పాల్పడ్డారు. ఈ దారుణ ఘటన తెలంగాణ రాష్ట్రంలోని మంచిర్యాల జిల్లా చెన్నూరులో వెలుగు చూసింది. ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
చెన్నూరులోని భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్బీఐ) బ్రాంచిలో క్యాషియర్‌గా పనిచేస్తున్న నరిగె రవీందర్‌కు క్రికెట్ బెట్టింగ్ వ్యసనం ఉంది. ఈ బెట్టింగుల్లో సుమారు రూ.40 లక్షలు పోగొట్టుకోవడంతో ఆ నష్టాన్ని పూడ్చుకునేందుకు అడ్డదారి తొక్కాడు. బ్యాంకు మేనేజర్ ఎన్నపురెడ్డి మనోహర్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగి లక్కాకుల సందీప్‌తో కలిసి ఖాతాదారులు బంగారాన్ని కొట్టేయడానికి పథకం రచించాడు. 
 
గతేడాది అక్టోబరు నుంచి వీరు తమ ప్రణాళికను అమలు చేశారు. బ్యాంకులోని 402 మంది ఖాతాదారుల గోల్డ్‌లోన్ ప్యాకెట్ల నుంచి కొద్దికొద్దిగా 25.17 కిలోల బంగారాన్ని బయటకు తీశారు. ఈ బంగారాన్ని కొన్ని ప్రైవేట్ గోల్డ్ లోన్ సంస్థల్లో పనిచేస్తున్న ధీరజ్, రాజశేఖర్, కిషన్లకు అప్పగించారు. 
 
వారు ఆ బంగారాన్ని తమ సంస్థల్లో తాకట్టు పెట్టి రుణాలు తీసుకున్నారు. వచ్చిన డబ్బులోంచి కమీషన్ ఉంచుకుని మిగిలిన మొత్తాన్ని రవీందర్ ఖాతాకు బదిలీ చేసేవారు. ఈ డబ్బును రవీందర్ ఆన్‌లైన్ క్రికెట్ బెట్టింగ్ కోసం ఉపయోగించినట్లు, ఈ సొమ్మంతా విదేశాలకు మళ్లినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది.
 
ఇటీవల బ్యాంకు ఆడిటింగ్ తనిఖీల్లో ఈ భారీ గోల్డ్‌లోన్ స్కామ్ బట్టబయలైంది. అనుమానాస్పద లావాదేవీలను గుర్తించిన అధికారులు, వెంటనే బ్యాంకు రీజినల్ మేనేజర్‌కు సమాచారం ఇచ్చారు. ఆయన చెన్నూరు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. పోలీసులు క్యాషియర్ రవీందర్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా మొత్తం స్కామ్ గుట్టు రట్టయింది.
 
ఈ కేసుకు సంబంధించిన వివరాలను రామగుండం సీపీ అంబర్ కిశోర్ ఝా మీడియాకు వెల్లడించారు. బ్యాంకు మేనేజర్, క్యాషియర్‌తో పాటు ప్రైవేట్ ఫైనాన్స్ ఉద్యోగులు, బినామీలతో కలిపి మొత్తం 47 మందిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. నిందితుల నుంచి ఇప్పటివరకు 15.23 కిలోల బంగారం, రూ.1.61 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు.