శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By ఐవీఆర్
Last Updated : శనివారం, 5 అక్టోబరు 2024 (15:43 IST)

అమలతో మాట్లాడిన ప్రియాంకా గాంధీ, కొండా సురేఖ రాజీనామా?

Konda surekha
భారాస నాయకుడు కేటీఆర్ పైన వ్యాఖ్యానిస్తున్న క్రమంలో తెలంగాణ మంత్రి కొండా సురేఖ అక్కినేని నాగార్జున, చైతన్య, సమంతల గురించి అనుచిత వ్యాఖ్యలు చేసారు. ఇవి కాస్తా తీవ్ర దుమారం రేపాయి. కేటీఆర్ కారణంగానే నాగచైతన్య-సమంత విడాకులు తీసుకున్నారని కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్లు సురేఖ చెప్పారు. ఐతే జరగాల్సిన నష్టం జరిగిపోయింది.
 
అక్కినేని నాగార్జున సతీమణి అక్కినేని అమలతో కాంగ్రెస్ పార్టీ నాయకురాలు ప్రియాంకా గాంధీ మాట్లాడినట్లు వార్తలు వస్తున్నాయి. కొండా సురేఖ చేసిన వ్యాఖ్యల వల్ల తమ కుటుంబం తీవ్రంగా ఆవేదన చెందుతున్నామని ప్రియాంకతో అమల చెప్పినట్లు సమాచారం. దీనితో కొండా సురేఖను మంత్రి పదవి నుంచి తొలగించాలని పార్టీ అధిష్టానం యోచిస్తున్నట్లు తెలుస్తోంది.
 
ఐతే పదవి నుంచి నేరుగా ఆమెను తొలగించకుండా, కొండా సురేఖ తనంతట తానుగా రాజీనామా చేయాలని సమాచారం పంపినట్లు వార్తలు హల్చల్ చేస్తున్నాయి. ఏం జరుగుతుందో వేచి చూద్దాము.