ఫార్ములా ఈ-కార్ రేస్ అవినీతి కేసు: కేటీఆర్‌పై విచారణకు అనుమతి
తెలంగాణ రాజకీయాల్లో సంచలనం చోటుచేసుకుంది. పార్ములా ఈ-కార్ రేస్ కేసులో కీలకపరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో మాజీమంత్రి, భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను విచారించేందుకు అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ)కి ఆ రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అనుమతి ఇచ్చారు. ఈ మేరకు ప్రభుత్వం పంపిన ఫైలుపై ఆయన సంతకం చేసారు. దీంతో ఈ-కార్ రేస్ కేసులో కేటీఆర్ వద్ద ఏసీబీ అధికారులు విచారించనున్నారు.
గవర్నర్ అనుమతి లభించడంతో కేటీఆర్‌పై అభియోగాలు నమోదు చేసి విచారణ చేపట్టేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. ఈ కేసులో త్వరలోనే కేటీఆర్‌కు నోటీసులు జారీ చేసి విచారణ ప్రక్రియను ప్రారంభించే అవకాశం ఉంది. విచారణ తర్వాత ఈ కేసులో చార్జిషీటును దాఖలు చేయాలని ఏసీబీ భావిస్తోంది. ఈ పరిణామంతో బీఆర్ఎస్ వర్గాల్లో తీవ్ర కలకలం చెలరేగింది.
మరోవైపు, ఇదే కేసులో కీలక నిందితుడుగా ఉన్న సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్‌పై విచారణకు కూడా ప్రభుత్వం చర్యలు వేగవంతం చేసింది. ఆయనపై అభియోగాలు నమోదు చేసేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం సిబ్బంది, శిక్షణ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు కూడా లేఖ రాసింది. దీనిపై కేంద్రం అనుమతి రాగానే అరవింద్‌పై ఏసీబీఐ అధికారులు కేసు నమోదుచేసి విచారణ ప్రారంభించనున్నారు.