గురువారం, 25 సెప్టెంబరు 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 18 సెప్టెంబరు 2025 (09:44 IST)

హైదరాబాద్ నగరంలో ఆకాశానికి చిల్లుపడిందా...

హైదరాబాద్ నగరంలో ఆకాశానికి చిల్లుపడిందా అన్న చందంగా భారీ వర్షం కురిసింది. బుధవారం సాయంత్రం నుంచి రాత్రి వరకు వరుణుడు ఒక్కసారిగా విరుచుకుపడ్డాడు. అనేక ప్రాంతాల్లో వర్షం దంచికొట్టింది. ముఖ్యంగా, మషీరాబాద్, సికింద్రాబాద్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, అమీర్ పేట్, సనత్ నగర్, కృష్ణా నగర్, మియాపూర్, చందా నగర్, మాదాపూర్, రాయదుర్గం, కేపీహెచ్‌బీ, సుచిత్ర, గుడి మైసమ్మ, దుండిగల్ కాప్రా, ఏఎస్ రావు నగర్ తదితర ప్రాంతాల్లో కుండపోత వర్షం కురిసింది. దీంతో వీధులు రహదారులు జలమయమయ్యాయి. పలు కాలనీల్లో వరద నీరు ఉధృతంగా ప్రవహించింది. 
 
యూసుఫ్ గూడా కృష్ణా నగర్ బి బ్లాక్‌లో వరద నీరు ఉద్ధృతంగా ప్రవహించడంతో వాహనదారులు, వృద్ధులు, చిన్నారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మాదాపూర్ - హైటెక్ సిటీ చౌరస్తా వద్ద భారీ వర్షంతో ట్రాఫిక్ జామ్ అయింది. రాయదుర్గం, అమీర్‌పేట, బంజారాహిల్స్ ఐకియా మార్గంలో తదితర ప్రాంతాల్లో వాహనాలు నెమ్మదిగా కదిలాయి. మియాపూర్ - చందానగర్ నగర్ మార్గంలో రహదారిపై మోకాలిలోలు నీరు నిలిచిపోయింది. దీంతో ముంబయి జాతీయ రహదారిపై 3 కిలోమీటర్ల మేర వాహనాలు బారులు తీరాయి.
 
భారీ వర్షాల నేపథ్యంలో వరద ప్రవాహంతో పలు చోట్ల ద్విచక్రవాహనాలు కొట్టుకుపోయాయి. అమీర్‌పేట్‌లోని గాయత్రి నగర్‌లో ఇళ్లలోకి వరద నీరు చేరింది. సీతాఫల్ మండిలో ప్రహారీ గోడ కూలింది. సురేష్ థియేటర్ సమీపంలో ఆటోపై గోడ కూలింది. ఆ సమయంలో ఎవరూ లేక పోవడంతో పెను ప్రమాదం తప్పింది. రామ్ గోపాల్ పేట్‌లోని బస్తీలు, చిల్కలగూడ, వారాసిగూడ, మెట్టుగూడ, ఈస్ట్ మారేడ్‌పల్లి అంబేద్కర్ నగర్, మియాపూర్ దీప్తిశ్రీ నగ‌ర్‌‌లోని ఇళ్లలోకి వరద నీరు చేరింది. ఒలిఫెంట రైల్వే వంతెన కింద భారీ వరద నీరు చేరడంతో సికింద్రాబాద్ - తార్నాక, ముషీరాబాద్ వైపు వెళ్లే రహదారులను పోలీసులు నిలిపివేశారు. 
 
ముషీరాబాద్‌లో అత్యధికంగా 18.43 సెం.మీ వర్షపాతం నమోదైంది. సికింద్రాబాద్ నగరంలో 18 సెం.మీ, శేరిలింగంపల్లిలో 12.6 సెం.మీ, చందానగర్‌‍లో 11.2 సెం.మీ, లింగంపల్లిలో 10.7 సెం.మీ, జూబ్లీహిల్స్‌లో 8.9 సెం.మీ, బేగంపేటలో 8.7 సెం.మీ, ఖైరతాబాద్ 8.5 సెం.మీ వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు.