ఆ కలెక్టర్‌కు డ్రెస్ సెన్స్ లేదు.. ఆయనను చూస్తేనే భయంగా ఉంది.. టి హైకోర్టు
తెలంగాణ రాష్ట్రంలోని రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝాపై ఆ రాష్ట్ర హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ కలెక్టర్‌కు ఏమాత్రం డ్రెస్ సెన్స్ లేదని, పైగా, ఆయనను చూస్తే భయంగా ఉందని వ్యాఖ్యానించింది. ఇలాంటి వ్యక్తి ప్రజలకు ఎలా సేవ చేస్తారని, అందువల్ల ఆయనపై చర్యలు తీసుకోవాలంటూ హోం శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీని ఆదేశించింది.
మిడ్ మానేరు నిర్వాసితులు వనబట్ల కవితకు నష్టపరిహారం చెల్లించాలని గతంలో హైకోర్టు ఆదేశించింది. కానీ, ఈ ఉత్తర్వులను కలెక్టర్ అమలు చేయకపోగా, ఆర్డీవో, ఎమ్మార్వోలకు చెప్పి నిర్వాసితురాలిపై అక్రమ కేసులు పెట్టించారనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో తనకు న్యాయం చేయాలంటూ కవిత హైకోర్టును ఆశ్రయించారు.
ఈ పిటిషన్‌పై గతంలో విచారణ జరిగింది. ఆ సమయంలో సందీప్ కుమార్ కోర్టుకు హాజరయ్యారు. ఆ సమయంలో ఆయన డ్రెసింగ్ సెన్స్‌పై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టు ప్రొసీడింగ్స్ తెలియదా, కోర్టుకు వచ్చే పద్దతి ఇదేనా అంటూ ప్రశ్నించింది.
తాజాగా మరోమారు అదే విషయంపై అసహనం వ్యక్తం చేసింది. అదే సమయంలో గతంలో బాధితురాలికి ఇచ్చిన నష్టపరిహారం తీర్పును యధావథిగా అమలు చేయాలని ప్రభుత్వాన్ని, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని హైకోర్టు ఆదేశించింది. అలాగే, డ్రెస్ సెన్స్ పాటించని కలెక్టర్‌పై చర్యలు తీసుకోవాలని సూచించింది.