బుధవారం, 3 సెప్టెంబరు 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 1 సెప్టెంబరు 2025 (15:07 IST)

ఉత్తర తెలంగాణాలో దంచికొట్టనున్న వర్షాలు...

Rains
ఉత్తర తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు దంచికొట్టనున్నాయి. వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని, దీని ప్రభావం కారణంగా ఉత్తర తెలంగాణాలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ ప్రాంతీయ వాతావరణ కేంద్రం తెలిపింది 
 
ఈ అల్పపీడనం ప్రభావం కారణంగా రాబోయే రెండు రోజులు పాటు భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, పెద్దపల్లి, హన్మకొండ, జగిత్యాల, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్ నగర్, నిర్మల్, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, వరంగల్ జిల్లాల్లో అక్కడక్కడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. 
 
వాయువ్య బంగాళాఖాతంలో రానున్న 12 గంటల నుంచి 36 గంటల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో తెలంగాణాతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. 
 
జనసేన సంస్థాగత బలోపేతం కోసం త్రిశూల్ వ్యూహం : పవన్ కళ్యాణ్ 
 
జనసేన పార్టీ సంస్థాగత బలోపేతం చేసేందుకు ఆ పార్టీ అధ్యక్షుడు, ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దృష్టించారు. ఇందుకోసం ఆయన త్రిశూల్ వ్యూహాన్ని అమలు చేయనున్నట్టు తెలిపారు. వైజాగ్ వేదికగా శనివారం జరిగిన సేనతో సేనాని అనే కార్యక్రమంలో ఆయన కీలక ప్రసంగం చేశారు. 
 
పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడం, రాబోయే దశాబ్దకాలానికి యువ నాయకత్వాన్ని సిద్ధం చేయడమే లక్ష్యంగా కీలక కార్యాచరణను ప్రకటించారు. రాష్ట్రానికి సుస్థిర పాలన అందించేందుకు ప్రస్తుత ఎన్డీయే కూటమి కనీసం 15 ఏళ్ల పాటు కొనసాగాల్సిన అవసరం ఉందని ఉద్ఘాటించారు. ఈ వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
 
పార్టీని క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేసేందుకు పవన్ కల్యాణ్ ఒక స్పష్టమైన ప్రణాళికను ఆవిష్కరించారు. దసరా పండుగ తర్వాత 'త్రిశూల్' అనే ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. ఈ కార్యక్రమం ద్వారా పార్టీలోని ప్రతి క్రియాశీల సభ్యుడిని నేరుగా పార్టీ సెంట్రల్ కమిటీ నేతలతో అనుసంధానం చేస్తామని వివరించారు. దీని కోసం ప్రత్యేకంగా ఒక కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. 
 
రాబోయే పదేళ్లలో యువతను బలమైన నాయకులుగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని, 2030 నాటికి అనేకమంది శక్తివంతమైన నాయకులను రాష్ట్రానికి అందిస్తానని హామీ ఇచ్చారు. పార్టీ కోసం నిరంతరం శ్రమిస్తున్న వీరమహిళలకు సముచిత స్థానం కల్పిస్తామని, పార్టీ పదవుల్లో వారికి 33 శాతం కేటాయిస్తామని ప్రకటించారు. క్రమశిక్షణ, అంకితభావం, స్థిరత్వం ఉంటే ఎవరైనా ఉన్నత స్థాయికి ఎదగవచ్చని యువతకు పిలుపునిచ్చారు.
 
"మనం బలహీనపడితే రాష్ట్రంలో మళ్లీ అరాచక పాలన వస్తుంది. కాబట్టి ఈ కూటమి చాలా కాలం కొనసాగాలి. రాష్ట్రానికి వచ్చే 15 ఏళ్ల పాటు రాజకీయ స్థిరత్వం చాలా అవసరం" అని ఆయన అభిప్రాయపడ్డారు. భాగస్వామ్య పక్షాల మధ్య చిన్న చిన్న సమస్యలు తలెత్తితే వాటిని సామరస్యంగా చర్చించుకుని పరిష్కరించుకోవాలని సూచించారు. 2019-24 మధ్య కాలంలో తమ పార్టీ ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నా, ఎన్నడూ ప్రధాని లేదా హోంమంత్రి సహాయం కోరలేదని, ఆత్మగౌరవంతోనే నిలబడ్డామని గుర్తుచేశారు. 
 
ప్రజాస్వామ్య వ్యవస్థలో హింసకు తావులేదని, తాను విప్లవ మార్గాన్ని ఎంచుకోలేదని పవన్ పేర్కొన్నారు. రాజకీయాలంటే వ్యాపారం కాదని, ప్రజాసేవ అని నమ్మి నిస్వార్థంగా పనిచేస్తున్నందునే మంచి ఫలితాలు వస్తున్నాయని ఆయన కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఈ సభ జనసేన శ్రేణుల్లో నూతనోత్సాహాన్ని నింపడంతో పాటు, పార్టీ భవిష్యత్ ప్రయాణంపై ఒక స్పష్టమైన మార్గదర్శినిగా నిలిచింది.