తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగ మేళ... 1743 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్
తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వ రవాణా సంస్థ టీజీ ఆర్టీసీలోని పలు పోస్టుల భర్తీకి బుధవారం నోటిఫికేషన్ జారీ అయింది. మొత్తం ఉద్యోగాల సంఖ్య 1,743 కాగా.. ఇందులో డ్రైవర్ కొలువులు 1,000, శ్రామిక్ పోస్టులు 743 ఉన్నాయి. అక్టోబరు 8వ తేదీ నుంచి 28 వరకు అర్హులైన అభ్యర్థుల నుంచి www.tgprb.in వెబ్ సైట్ ద్వారా దరఖాస్తులను ఆన్‍లైన్‌లో స్వీకరించనున్నారు. గతంలో ఆర్టీసీనే తమ సంస్థలో ఉద్యోగాల్ని భర్తీ చేసేది. ఈ సారి డ్రైవర్, శ్రామిక్ పోస్టుల భర్తీని పోలీసు నియామక బోర్డు ద్వారా భర్తీ చేయనున్నారు.
ఈ పోస్టుల్లో డ్రైవర్ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకునే అభ్యర్థి వయసు 22 ఏళ్ల నుంచి 35 ఏళ్ల వరకు.. శ్రామిక్ ఉద్యోగాలకు 18 నుంచి 30 సంవత్సరాల వరకు వయోపరిమితి ఉంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరీలకు ఐదేళ్లు.. ఎక్స్ సర్వీసెమెన్‌కు మూడేళ్ల వయోపరిమితి సడలింపు ఉంటుందని ఆ నోటిఫికేషన్‌లో పేర్కొంది.
శారీరక దారుఢ్యం, వైద్య, డ్రైవింగ్ టెస్ట్, సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ద్వారా ఉద్యోగాలకు ఎంపిక చేయనున్నట్లు పోలీసు రిక్రూట్మెంట్ బోర్డు తెలిపింది. డ్రైవర్ పోస్టులకు దరఖాస్తు ఫీజు ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.300, ఇతరులకు రూ.600.. శ్రామిక్ పోస్టులకు ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.200, ఇతరులకు రూ.400 చొప్పున ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.
శ్రామిక్ పోస్టులకు ఐటీఐ పాసై ఉండాలి. డ్రైవర్ కొలువులకు కనీస విద్యార్హత పదో తరగతి.. దీంతోపాటు నోటిఫికేషన్ తేదీ నాటికి 18 నెలలకు తక్కువ కాకుండా హెవీ ప్యాసింజర్ మోటారు వెహికిల్ లేదా హెవీ గూడ్స్ వెహికిల్ లేదా రవాణా వెహికిల్ లైసెన్స్ కలిగి ఉండాలి. డ్రైవర్ ఉద్యోగాలకు రూ.20,960 - 60,080, శ్రామిక్ పోస్టులకు రూ.16,550 - 45,030 పేస్కేల్ ఉంటుంది. శ్రామిక్ పోస్టుల్లో అత్యధికంగా మెకానిక్(డీజిల్, మోటార్ వెహికిల్) 589 పోస్టులున్నాయి.