సోమవారం, 24 నవంబరు 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 23 నవంబరు 2025 (10:54 IST)

మతం పేరుతో ఇతరులను చంపడం - హింసించడాన్ని వ్యతిరేకిస్తా : ఏఆర్ రెహ్మాన్

ar rehman
మతం పేరుతో ఇతరులను చంపడాన్ని, హింసించడాన్ని తాను తీవ్రంగా వ్యతిరేకిస్తానని ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహ్మాన్ అన్నారు. ఆయన తన మత విశ్వాసాలు, చేపట్టే ఆధ్యాత్మిక పర్యటనలోపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 
 
తాను మద్రాస్‌లో దిలీప్ కుమార్ రాజగోపాల పేరుతో జన్మించానని, ఆ తర్వాత సూఫిజం స్వీకరించానని తెలిపారు. హిందూ, ఇస్లాం, క్రైస్తవ మతాలను అధ్యయనం చేశానని, అన్ని మతాలకూ తాను అభిమానినే అని స్పష్టం చేశారు.
 
'నేను అన్ని మతాలను గౌరవిస్తాను. మతం పేరుతో ఇతరులను చంపడం లేదా హింసించడాన్ని మాత్రమే నేను వ్యతిరేకిస్తాను. నేను ప్రదర్శన ఇచ్చేటప్పుడు అది ఒక ఆలయంలా అనిపిస్తుంది. అక్కడ విభిన్న మతాలు, భాషల వారున్నా అందరం ఏకత్వ ఫలాలను ఆస్వాదిస్తాం' అని ఆయన పేర్కొన్నారు.
 
సూఫిజం వైపు ఆకర్షితుడవడానికి గల కారణాలను వివరిస్తూ, 'సూఫిజం అంటే మరణానికి ముందే మరణించడం లాంటిది. కామం, లోభం, ఈర్ష్య వంటి వాటిని చంపుకోవాలి. మీలోని ఆగ్రహం పోయినప్పుడు మీరు దేవుడిలా పారదర్శకంగా మారతారు' అని రెహమాన్ తెలిపారు. మతాలు వేర్వేరుగా కనిపించినా, వాటి మధ్య విశ్వాసంలో గొప్ప సారూప్యత ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. 
 
సూఫిజంలోకి మారమని ఎవరూ బలవంతం చేయలేదని, అది తమ హృదయం నుంచి వచ్చిన నిర్ణయమని ఆయన వివరించారు. ఇదేసమయంలో, తనకున్న కీర్తి వల్ల కుటుంబ కార్యక్రమాల్లో అభిమానులు సెల్ఫీల కోసం సరిహద్దులు దాటడం వల్ల కలిగే ఇబ్బందుల గురించి కూడా ఆయన ప్రస్తావించారు.