కోలీవుడ్ హీరో అజిత్ ఇంటికి బాంబు బెదిరింపు
కోలీవుడ్ అగ్రహీరో అజిత్ కుమార్ ఇంటికి అగంతకులు బాంబు బెదిరింపులకు పాల్పడ్డారు. అజిత్‍తో పాటు కాంగ్రెస్ పార్టీ తమిళనాడు శాఖ కార్యాలయమైన సత్యమూర్తి భవన్‌కు కూడా ఈ బాంబు బెదిరింపులు వచ్చాయి. దీంతో అప్రమత్తమైన చెన్నై నగర పోలీసులు ముమ్మర తనిఖీలు చేస్తున్నారు.
కాగా, గత కొన్ని రోజులుగా చెన్నై మహానగరంలోని పలువురు సినీ రాజకీయ నేతల నివాసాలు, కార్యాలయాలకు బాంబు బెదిరింపులు వస్తున్న విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలో చెన్నైలో ఉన్న కాంగ్రెస్ ప్రధాన కార్యాలయమైన సత్యమూర్తి భవన్, ఈసీఆర్‌లో ఉన్న నటుడు అజిత్ కుమార్ ఇల్లు, ఈవీసీ ఫిలిం సిటీ తదితర చోట్ల బాంబులు ఉన్నట్లు మంగళవారం డీజీపీ కార్యాలయానికి ఇ-మెయిల్ ద్వారా బెదిరింపులు వచ్చాయి.
దీంతో అప్రమత్తమైన బాంబు నిర్వీర్య ప్రత్యేక బృందం నిపుణులు క్షుణ్ణంగా తనిఖీ చేయగా అబద్ధమని తెలిసింది. అంతేకాకుండా ఎస్వీ శేఖర్, నటి రమ్యకృష్ణ ఇళ్లకు బాంబు బెదిరింపులు వచ్చాయి. సోమవారం నటి త్రిష ఇల్లు, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కార్యాలయానికి బాంబు బెదిరింపులు వచ్చాయి. ఈ ఘటనకు పాల్పడుతున్న వ్యక్తుల గురించి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.