Low Pressure: బంగాళాఖాతంలో నవంబర్ 19 నాటికి అల్పపీడనం
బంగాళాఖాతంలో నవంబర్ 19 నాటికి అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. దీనిపై అమరావతిలోని సీనియర్ ఐఎండీ శాస్త్రవేత్త డాక్టర్ ఎస్. కరుణసాగర్ మాట్లాడుతూ, ఈ అల్పపీడనం తీవ్రత గురువారం తర్వాత స్పష్టంగా కనిపిస్తుందని అన్నారు. అభివృద్ధి చెందుతున్న వాతావరణ వ్యవస్థ వల్ల దక్షిణ తీరప్రాంత ఆంధ్రప్రదేశ్, రాయలసీమకు వర్షపాతం రావచ్చని, ఉత్తర తీరప్రాంత ఆంధ్రప్రదేశ్‌పై తక్కువ ప్రభావం ఉంటుందని తెలిపారు.
బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడి అది వాయుగుండంగా మారే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయని అది 19, 20 తేదీల తర్వాత తీరాన్ని దాటే అవకాశం ఉందని వివరిస్తుంది. బంగాళాఖాతంలో ఈశాన్య రుతుపవనాలు బలపడేందుకు అనువుగా పరిస్థితులు మారనున్నాయి.
ఈ అల్పపీడనం ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడనుంది. తర్వాత పశ్చిమంగా పయనించే క్రమంలో ఇది బలపడి తుఫాన్‌గా మారుతుందని వాతావరణ నిపుణులు వెల్లడించారు. అనంతరం ఇది ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తా దిశగా రానుందని అంచనావేశారు. దక్షిణ కోస్తా జిల్లాలపై దీని ప్రభావం ఉంటుందని విశ్లేషించారు.