మంగళవారం, 11 నవంబరు 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 29 ఆగస్టు 2025 (11:09 IST)

కాఫీ బెర్రీ బోరర్ నుంచి అరకు కాఫీకి సరికొత్త ముప్పు

coffee
ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన అరకు కాఫీకి సరికొత్త ముప్పు ఎదురైంది. కాఫీ పంటను సర్వనాశనం చేసే అత్యంత ప్రమాదకరమైన 'కాఫీ బెర్రీ బోరర్' తెగులు ఏజెన్సీ ప్రాంతంలో తొలిసారిగా వెలుగుచూడటం గిరిజన రైతులను ఆందోళనకు గురిచేస్తోంది. గత 2000లో ఈ తెగులును హవాయిలో గుర్తించారు. అంతర్జాతీయంగా కాఫీ తోటలను నాశనం చేసే ఈ తెగులును మొదటిసారిగా మన ప్రాంతంలో గుర్తించడంతో అధికారులు అప్రమత్తమయ్యారు.
 
వారం రోజుల క్రితం అరకులోయ మండలం, పకనకుడి గ్రామంలోని సిరగం సువర్ణ అనే రైతుకు చెందిన కాఫీ తోటలో ఈ తెగులును కేంద్ర కాఫీ బోర్డు అధికారులు గుర్తించారు. పకనకుడి గ్రామంతో పాటు పరిసర మాలిసింగరం, మాలివలస, తుర్రయిగూడు, మంజగూడలోనూ కొన్ని మొక్కల్లో ఈ తెగులు కనిపించినట్టు కేంద్ర కాఫీ బోర్డు అధికారులు చెబుతున్నారు. 'హైపోథెనెమస్' అనే ఈ కీటకం కాఫీ పండులోకి రంధ్రం చేసుకుని ప్రవేశిస్తుంది. లోపలున్న గింజను పూర్తిగా తినేసి, అక్కడే సొరంగాలు ఏర్పాటు చేసుకుని గుడ్లు పెడుతుంది.
 
ఒక్కో కీటకం 50కి పైగా కాఫీ కాయ/పండు లోపల ఏర్పాటు చేసుకున్న సొరంగంలో గుడ్లు పెడుతుంది. 35 రోజులకు ఒక్కో గింజ నుంచి 30 నుంచి 40 కీటకాలు పుట్టుకొచ్చి, ఇతర కాయలకు వేగంగా వ్యాపిస్తాయి. ఈ విధంగా పంటను పూర్తిగా నాశనం చేసే శక్తి ఈ తెగులుకు ఉంది. ఈ తెగులు ఉనికిని గుర్తించిన వెంటనే కాఫీ బోర్డు శాస్త్రవేత్తలు రంగంలోకి దిగారు. 
 
తెగులు నివారణకు యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టారు. ఏజెన్సీలోని 11 మండలాల్లో ప్రత్యేక సర్వేలు నిర్వహిస్తూ, తెగులు వ్యాప్తిని అంచనా వేస్తున్నారు. రైతులు అప్రమత్తంగా ఉండాలని, అనుమానిత లక్షణాలు కనిపిస్తే వెంటనే తమకు సమాచారం ఇవ్వాలని అధికారులు సూచించారు.