అలాంటి పాత్రలు వస్తే మొహమాటం లేకుండా నో చెప్పేస్తా : మీనాక్షి చౌదరి
భవిష్యత్‌లో తనకు తల్లి పాత్రలు వస్తే ఏమాత్రం మొహమాటం లేకుండా నో చెప్పేస్తానని యంగ్ హీరోయిన్ మీనాక్షి చౌదరి అంటున్నారు. ఆమె గతంలో దుల్కర్ సల్మాన్‌తో కలిసి 'లక్కీ భాస్కర్' అనే చిత్రంలో ఇద్దరు పిల్లలకు తల్లిగా నటించారు. ఈ చిత్రం ఘన విజయం సాధించింది. దీనిపై ఆమె తాజాగా స్పందించారు.
లక్కీ భాస్కర్ కథ నచ్చడం వల్లే తాను తల్లి పాత్రలో కనిపించాను. అయితే, భవిష్యత్‌లో మాత్రం అలాంటి పాత్రలు వస్తే మొహమాటం లేకుండా నో చెబుతాను. నటిగా ఎలాంటి పాత్ర అయినా చేయాలి. కానీ, కొన్ని షరతులు పెట్టుకోవడం అవసరం అని వ్యాఖ్యానించారు. తనకు సీనియర్ హీరోలతో కలిసి నటించడం ఏమాత్రం ఇబ్బంది లేదని, పైగా, దాన్ని ఓ కొత్త జానర్‌గా భావిస్తానని ఆమె పేర్కొన్నారు.
కాగా, 'ఇచ్చట వాహనములు నిలుపరాదు' అనే సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన మీనాక్షి చౌదరి... 'హిట్-2'sssతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత తనకు వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ తన సినీ కెరీర్‌ను కొనసాగిస్తున్నారు.
ఈ క్రమంలో ప్రస్తుతం ఆమె మెగాస్టార్ చిరంజీవి నటించే "విశ్వంభర" చిత్రంలో నటిస్తున్నారు. దీనిపై ఆమె స్పందిస్తూ, చిరంజీవిగారితో చేస్తున్న 'విశ్వంభర' చిత్రం నా సినీ కెరీర్‌లో ఒక స్పెషల్ చాప్టర్‌గా నిలిచిపోతుందనే నమ్మకం ఉంది అని ఆమె ధీమా వ్యక్తం చేశారు.