శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 20 సెప్టెంబరు 2024 (16:13 IST)

శ్రీవారి లడ్డూ తయారీలో జంతువుల కొవ్వు వినియోగం నిజమే : ఈవో శ్యామల రావు

shyamala rao
పరమ పవిత్రంగా భావించే శ్రీవారి లడ్డూ తయారీలో జంతువుల కొవ్వు వినియోగం నిజమేనని తితిదే ఈవో శ్యామల రావు స్పష్టం చేశారు. తిరుమల లడ్డూ తయారీలో జంతువుల కొవ్వు వినియోగం దేశ వ్యాప్తంగా పెను చర్చకు దారితీసింది. ఈ వివాదంపై టీటీడీ ఈవో జె. శ్యామలరావు మీడియాతో మాట్లాడారు. తిరుమల లడ్డూ నాణ్యతపై కొంతకాలంగా ఫిర్యాదులు వస్తున్నాయన్నారు. నెయ్యిలో తీవ్ర కల్తీ జరిగిందని తేలిన వెంటనే చర్యలు చేపట్టామని, దీనిపై లోతుగా విచారణ జరిపేందుకు ఒక కమిటీని కూడా ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలిస్తున్నట్టు చెప్పారు. 
 
లడ్డూల తయారీలో వినియోగించే నెయ్యిని పరిశోధన నిమిత్తం జులై 6వ తేదీన ల్యాబ్‌కు పంపామన్నారు. వారంలో ల్యాబ్ నివేదికలు వచ్చాయని అన్నారు. ల్యాబ్ రిపోర్టు రెండు భాగాలుగా ఇచ్చారని వివరించారు 100 పాయింట్లు ఉండాల్సిన నెయ్యి నాణ్యత 20 పాయింట్లే ఉందని చెప్పారు. నెయ్యిలో భారీగా జంతువుల కొవ్వుతో కల్తీ జరిగినట్టు నిర్ధారణ అయిన నేపథ్యంలో, ఎలాంటి చర్యలు తీసుకోవాలనే అంశంపై కమిటీ వేశామని ఈవో చెప్పారు.
 
నెయ్యి నాణ్యత నిర్ధారణకు టీటీడీకి సొంత ల్యాబ్ లేదని, దాంతో గుజరాత్‌లోని ఎన్ డీడీబీ ల్యాబ్‌కు నెయ్యి శాంపిల్స్ పంపామని తెలిపారు. నెయ్యి కల్తీ పరీక్ష కోసం శాంపిల్స్ ఇలా బయటికి పంపడం చరిత్రలో ఇదే తొలిసారి అని వెల్లడించారు. ఎన్‌డీడీబీ ల్యాబ్ అనేది చాలా ప్రముఖమైనదని చెప్పారు.
 
తమిళనాడుకు చెందిన ఏఆర్ ఫుడ్స్ సరఫరా చేసిన నెయ్యిలో కల్తీ ఉన్నట్టు పరీక్షల్లో తేలిందని ఈవో శ్యామలరావు వెల్లడించారు. కిలో నెయ్యి రూ.320 నుంచి రూ.411 ధరతో సరఫరా చేశారని, స్వచ్ఛమైన నెయ్యిని అంత తక్కువ ధరకు సరఫరా చేయలేరని స్పష్టం చేశారు. అంత తక్కువ ధరకు నెయ్యి సరఫరా చేస్తున్నారంటే, అందులో కల్తీ చేస్తున్నారన్న అనుమానం వచ్చిందని అన్నారు.
 
నెయ్యిలో నాణ్యతా లోపాన్ని తాను కూడా గుర్తించానని ఈవో శ్యామలరావు పేర్కొన్నారు. లడ్డూ నాణ్యతపై పోటు సిబ్బందితో మాట్లాడానని, నెయ్యి నాణ్యతపై పోటు సిబ్బంది కూడా అసంతృప్తిని వ్యక్తం చేశారని, లడ్డూ నాణ్యంగా ఉండాలంటే నెయ్యి స్వచ్ఛమైనది అయ్యుండాలని వారు చెప్పారని ఈవో వివరించారు. దాంతో, నెయ్యి నాసిరకంగా ఉందని సరఫరా కాంట్రాక్టర్లకు చెప్పామని, తాము హెచ్చరించిన తర్వాత వారు నాణ్యత పెంచారని వెల్లడించారు.