శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 6 అక్టోబరు 2024 (09:23 IST)

శ్రీవారి అన్నప్రసాదంలో జెర్రి... ఖండించిన తితిదే

tirumala annadanam
తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి అన్న ప్రసాదంలో జెర్రి పడిందన్న ప్రచారంపై తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) అధికారులు స్పందించారు. మాధవ నిలయంలో తాము ఆరగించిన అన్న ప్రసాదంలో జెర్రి కనిపించిందని ఓ భక్తుడు చేసిన ఆరోపణలు వాస్తవదూరం అని స్పష్టం చేశారు. 
 
తిరుమల శ్రీవారి దర్శనార్థం వచ్చే వేలాది మంది భక్తులకు వడ్డించడానికి తితిదే సిబ్బంది పెద్ద మొత్తంలో అన్న ప్రసాదాలను ఎప్పటికపుడు తయారు చేస్తారని, అంత వేడిలో కూడా ఏమాత్రం చెక్కు చెదరకుండా ఒక జెర్రి ఉందని ఆ భక్తుడు పేర్కొనడం ఆశ్చర్యం కలిగిస్తుందని తితిదే తన ప్రకటనలో పేర్కొంది. 
 
ఒకవేళ పెరుగన్న కలపాలన్నా ముందుగా వేడి చేసిన అన్నాన్ని బాగా కలియదిప్పి, ఆ తర్వాత పెరుగు కలుపుతురాని వివరించింది. అలాంటి సమయంలో కూడా జెర్రి రూపు ఏమాత్రం చెక్కుచెదరకుండా ఉందనడం పూర్తిగా ఉద్దేశపూర్వకంగా చేసిన చర్యగా భావించాల్సి వస్తుందని తితిదే పేర్కొంది. దయచేసి భక్తులు ఇలాంటి అసత్య ప్రచారాన్ని నమ్మవద్దని విజ్ఞప్తి చేసింది.