శుక్రవారం, 10 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 18 డిశెంబరు 2024 (13:10 IST)

ఇంకా ఏం చూడాలి దేవుడా చెప్పు.. నేను ఇంకా ఎన్ని రన్స్ సాధించాలి : పృథ్వీ షా

Prithvi Shaw
భారత క్రికెట్ జట్టు యువ క్రికెటర్ పృథ్వీ షా అటు జాతీయ జట్టులోనూ, ఇటు దేశవాళీ క్రికెట్‌లో చోటు కోల్పోయాడు. ఇపుడు రాష్ట్ర జట్టులో కూడూ చోటు దక్కించుకునేందుకు అపసోపాలు పడుతున్నారు. ఇటీవల జరిగిన ఐపీఎల్ మెగా వేలం పాటల్లో కూడా పృథ్వీ షాను కొనుగోలు చేసేందుకు ఏ ఒక్క ఫ్రాంచైజీ ముందుకు రాలేదు. ఈ పాటల్లో పృథ్వీ షా బేస్ ధర రూ.75 లక్షలుగా నిర్ణయించారు. అయినప్పటికీ అమ్ముడు పోలేదు. ఈ క్రమంలో ముంబై రంజీ జట్టు నుంచి సైతం ఉద్వాసనకు గురయ్యాడు. ఇపుడు విజయ్ హజారే ట్రోఫీ కోసం ముంబై జట్టులో కూడా చోటు దక్కించుకోలేకపోయాడు. 
 
తాజాగా ముగిసిన సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 ట్రోఫీలోనూ అతడు నిలకడగా రాణించలేకపోయాడు. టోర్నీలో 9 మ్యాచులు ఆడి కేవలం 197 రన్స్ మాత్రమే చేశాడు. అలాగే మధ్యప్రదేశ్‌లో జరిగిన ఫైనల్లో ఈ యువ ప్లేయర్ కేవలం 10 పరుగులు మాత్రమే చేశాడు. దీంతో ముంబై జట్టు పృధ్వీ షాపై వేటు వేసింది. ఈ నెల 21 నుంచి ప్రారంభం కానున్న విజయ్ హజారే ట్రోఫీ మొదటి మూడు మ్యాచ్‌లకు ముంబై జట్టును ప్రకటించింది. ఇందులో అతనికి చోటు కల్పించలేదు.
 
దీనిపై పృథ్వీ షా నిర్వేదం వ్యక్తం చేస్తూ ఓ ట్వీట్ చేశాడు. "ఇంకా ఏం చూడాలి దేవుడా చెప్పు.. నేను ఇంకా ఎన్ని రన్స్ సాధించాలి. లిస్ట్-ఏ క్రికెట్లో 65 ఇన్నింగ్స్‌లో 126 స్ట్రైక్ రేట్, 55.7 సగటుతో 3,399 పరుగులు చేశా. నన్ను ఎంపిక చేయడానికి ఈ గణాంకాలు సరిపోవు. అయినా నీపై నమ్మకం ఉంచుతాను. ప్రజలు ఇప్పటికీ నన్ను విశ్వసిస్తున్నారని ఆశిస్తున్నాను. ఎందుకంటే నేను ఖచ్చితంగా తిరిగి వస్తాను. ఓం సాయిరాం" అని పృధ్వీ షా తన ఇన్‌స్టా స్టోరీలో రాసుకొచ్చారు.