మరో వ్యక్తితో సన్నిహితంగా వుంటోందని వివాహితను హత్య చేసిన మొదటి ప్రియుడు
కర్నూలు జిల్లా వెల్దుర్తిలో దారుణ హత్య జరిగింది. ఇద్దరు పురుషులతో వివాహేతరం సంబంధం సాగిస్తూ వచ్చిన వివాహితను మొదటి ప్రియుడు అత్యంత దారుణంగా హత్య చేసి పరారయ్యాడు. పోలీసులు వెల్లడించిన వివరాలు ఇలా వున్నాయి. వెల్దుర్తిలోని 14వ వార్డులో నివాసం వుండే ఉజ్మాకు, మస్తాన్‌కు పదిహేనేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు వున్నారు. ఐతే భర్త పనిపై తెలంగాణలోని హైదరాబాదుకి వెళ్లినప్పుడు వడ్డెగేరిలో నివాసం వుండే మరో వ్యక్తితో పరిచయం ఏర్పడింది. అది కాస్తా వివాహేతర సంబంధానికి దారి తీసింది.
ఈ క్రమంలో భర్త ఊరెళ్లినప్పుడల్లా ఉజ్మా అతడితో సంబంధాన్ని సాగిస్తూ వచ్చింది. అవసరం వచ్చినప్పుడల్లా అతడి నుంచి నగదు కూడా వాడుకుంది. ఇదిలావుండగా ఇటీవలే ఆమె ఓ పార్టీ నాయకురాలితో కలిసి పలు కార్యక్రమాల్లో పాల్గొంది. అక్కడ ఆమెకి మరో వ్యక్తి పరిచయమయ్యాడు. అతడితో చనువుగా వుండటాన్ని చూసిన మొదటి ప్రియుడు ఉజ్మాతో గొడవపడ్డాడు. తన డబ్బు తనకు ఇచ్చేయాలంటూ ఒత్తిడి చేసాడు. దీనితో సదరు వ్యక్తిపై ఉజ్మా పోలీసు కేసు పెట్టింది.
ఆ కేసుతో మరింత కసి పెంచుకున్న మొదటి ప్రియుడు బుధవారం నాడు మధ్యాహ్నం ఆమెను హత్య చేసి పరారయ్యాడు. పోతూపోతూ ఆమె ఇంటికి ఏర్పాటు చేసిన సీసీ కెమేరాలు కూడా లాగేసుకుని వెళ్లిపోయాడు. కుమార్తెలు ఇంటికి వచ్చి తలుపు కొట్టినా తలుపు తీయకపోవడంతో పొరుగువారి సాయంతో తాళం పగులగొట్టి చూడగా ఉజ్మా రక్తపు మడుగులో విగతజీవిగా కనబడిందని వెల్లడించారు. కేసును దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.