శుక్రవారం, 28 నవంబరు 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By సెల్వి
Last Updated : బుధవారం, 24 సెప్టెంబరు 2025 (18:29 IST)

NEET: నీట్‌లో 99.99 శాతం.. ఎంబీబీఎస్ అడ్మిషన్ రోజే ఉరేసుకున్న విద్యార్థి.. ఎక్కడ?

NEET
NEET
జాతీయ వైద్య ప్రవేశ పరీక్ష (నీట్)లో టాప్ ర్యాంక్ సాధించిన మహారాష్ట్రకు చెందిన 19 ఏళ్ల విద్యార్థి విశ్వవిద్యాలయానికి వెళ్లాల్సిన రోజే ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాదం చంద్రపూర్ జిల్లాలో చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. నవర్గావ్‌కు చెందిన బాధితుడు అనురాగ్ అనిల్ బోర్కర్ నీట్ యుజి 2025 పరీక్షలో అత్యుత్తమ మార్కులు సంపాదించాడు. ఈ పరీక్షల్లో 99.99 శాతం సాధించాడు. ఈ పరీక్షల్లో 99.99 శాతం సాధించిన అతనికి ఓబీసీ విభాగంలో 1475 ఆల్ ఇండియా ర్యాంక్‌ను సంపాదించిపెట్టింది.
 
ఈ క్రమంలో అనురాగ్ తన ఎంబీబీఎస్ చదువును ప్రారంభించడానికి ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌కు వెళ్లాల్సి ఉంది. అంతా సర్దుకుంటున్న వేళ.. అనురాగ్ ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీంతో అతని కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామ ప్రజలు షాక్ అయ్యారు. ఉన్నత చదువుల కోసం తమ బిడ్డ యూపీకి వెళ్తాడనుకుంటే ఇలా తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయాడని అనురాగ్ తల్లిదండ్రులు వాపోతున్నారు. 
 
ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు సంఘటన స్థలం నుండి సూసైడ్ నోట్‌ను స్వాధీనం చేసుకున్నారు. అయితే సూసైడ్ నోట్ నుంచి పూర్తి విషయాలు అధికారికంగా విడుదల చేయలేదు. ఆ నోట్‌లో అనురాగ్ డాక్టర్ కావాలని కోరుకోవడం లేదని పేర్కొన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఎంబీబీఎస్ చదవడం ఇష్టం లేకే అనురాగ్ ఆత్మహత్యకు పాల్పడ్డాడని సూసైడ్ నోట్ చెప్తున్నా.. అతని ఆత్మహత్యకు వేరేదైనా కారణం వుందా అని పోలీసులు అనుమానిస్తున్నారు. దీనిపై వివిధ కోణాల్లో దర్యాప్తు జరుపుతున్నారు.