ఇరాన్ అణు కార్యక్రమం : ఆంక్షలు మరింత కఠినతరం...
ఇరాన్ అణు కార్యక్రమంపై ఆంక్షలను ఐరాస పునరుద్ధరించింది. ఆదివారం అర్థరాత్రి నుంచి ఇవి అమల్లోకి వచ్చాయి. దీంతో ఇప్పటికే ఆహారం, నిధుల కొరత ఎదుర్కొంటున్న ఆ దేశం మరింత కష్టాల్లోకి జారనుంది. ఆంక్షలను ఆపేందుకు చివరి నిమిషం వరకు ఇరాన్ ప్రయత్నించినా విఫలమైంది.
ఐరాస ఆంక్షల ప్రకారం ఇరాన్‌కు విదేశాల్లో ఉన్న ఆస్తులను స్తంభింపజేయడం, ఆయుధ డీల్స్‌ను నిలిపివేయడం వంటివి చేయనున్నారు. ఇరాన్ బాలిస్టిక్ మిసైల్ ప్రోగ్రామ్‌పై చర్యలు తీసుకోవడం కూడా ఈ జాబితాలో ఉంది. నిజానికి అక్టోబరు 18తో ఈ ఆంక్షలు శాశ్వతంగా తొలగిపోవాల్సి ఉంది. అయితే గతంలో జరిగిన జాయింట్ కాంప్రిహెన్సివ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ (జేసీపీవోఏ) ఒప్పందాన్ని ఇరాన్ ఉల్లంఘించింది. దీంతో ఆంక్షలు ఎదుర్కోవాల్సి వచ్చింది.
జేసీపీవోఏ ఒప్పందం ప్రకారం అందులో సంతకం చేసిన ఏ దేశమైనా అవసరమైతే ఆంక్షలను పునరుద్ధరించవచ్చు. ఈ నేపథ్యంలో టెహ్రాన్ ఈ ఒప్పందాన్ని ఉల్లంఘించిందని ఐరోపా దేశాల ప్రతినిధులు ఆగస్టులోనే ఐరాసకు వెల్లడించారు. జర్మనీ, యూకే 30 రోజుల క్రితమే ఆంక్షలను పునరుద్ధరించాలని నిర్ణయించాయి.
దీనికి తోడు ఈ ప్రక్రియను ఐరాస భద్రతా మండలి వీటో చేయడానికి వీల్లేకుండా డిజైన్ చేశారు. దీంతో చైనా, రష్యా ఈ విషయంలో ఏమీ చేయలేని పరిస్థితి నెలకొంది. ఇదిలావుండగా రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ మాట్లాడుతూ ఈ ఆంక్షలు ఇరాన్‌కు ఉచ్చుగా అభివర్ణించారు.