హోం వర్క్ చేయలేదనీ చెట్టుకు వేలాడదీసిన టీచర్లు
ఛత్తీస్‍గఢ్ రాష్ట్రంలో అమానవీయ సంఘటన చోటుచేసుకుంది. హోం వర్క్ చేయలేదన్న అక్కసుతో ఓ విద్యార్థిని కొందరు ఉపాధ్యాయులు చెట్టుకు వేలాడదీశారు. ఈ ఘటన సూరజ్‌పూర్ జిల్లా నారాయణ్‌పూర్‌లోని హంసవాణి విద్యామందిర్‌లో వెలుగుచూసింది. బాలుడుని చెట్టుకు వేలాడతీసిన దృశ్యాన్ని కొందరు స్థానికులు వీడియో, ఫోటో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఇది వైరల్ అయింది.
దీనిపై ఆగ్రహానికి గురైన గ్రామస్థులు ఆ టీచర్లపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. పాఠశాల వద్ద పెద్దఎత్తున నిరసనలు చేపట్టారు. ఈ ఘటనపై జిల్లా విద్యాశాఖ స్పందిస్తూ.. దీనిపై దర్యాప్తునకు ఆదేశించినట్లు తెలిపింది. సమగ్ర విచారణ జరుపుతామని, తప్పు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొంది.
కాగా, పాఠశాలకు చెందిన సుభాష్ శివహరే అనే వ్యక్తి ఈ చర్యను సమర్థిస్తూ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఇది చిన్న శిక్షగా ఆయన అభివర్ణించారు. సరిగ్గా చదువుకోవాలని పిల్లాడిని భయపెట్టేందుకే ఇలా చేశారని వ్యాఖ్యానించారు. సుభాష్ వ్యాఖ్యలు గ్రామస్థుల ఆగ్రహాన్ని మరింత పెంచింది. ఈ క్రమంలో పాఠశాల్లో కొనసాగుతున్న చర్యలపై అధికారులు విచారణను ప్రారంభించారు.