గోవా మాజీ ముఖ్యమంత్రి రవి నాయక్ ఆకస్మిక మృతి
గోవా రాజకీయాల్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, రాష్ట్ర వ్యవసాయ శాఖామంత్రి రవి నాయక్ ఆకస్మికంగా ప్రాణాలు కోల్పోయారు. ఆయన గుండెపోటుతో తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. నాలుగు దశాబ్దాలుగా గోవా రాజకీయాల్లో కీలక పాత్ర పోషించిన రవి నాయక్ మృతితో రాష్ట్రంలో విషాద ఛాయలు అలముకున్నాయి.
రవి నాయక్ తన రాజకీయ ప్రస్థానాన్ని 1980లలో మహారాష్ట్రవాది గోమంతక్ పార్టీ (ఎంజీపీ)తో ప్రారంభించారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరి కీలక నేతగా ఎదిగారు. ఆయన రెండుసార్లు గోవా ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. 1991లో, ఆ తర్వాత 1994లో సీఎంగా పనిచేశారు. 1998 నుంచి 1999 వరకు లోక్‌సభ సభ్యుడిగా కూడా సేవలందించారు.
2022 గోవా అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆయన బీజేపీలో చేరారు. ప్రమోద్ సావంత్ నేతృత్వంలోని ప్రభుత్వంలో వ్యవసాయ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. క్షేత్రస్థాయిలో ప్రజలతో బలమైన సంబంధాలు కలిగిన నేతగా, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన వ్యక్తిగా ఆయనకు మంచి పేరుంది.
కాగా, రవి నాయక్ మరణం పట్ల ప్రధాని నరేంద్ర మోడీ, పలువురు కేంద్ర మంత్రులు దిగ్భ్రాంతి, సంతాపాన్ని వ్యక్తం చేశారు. 'గోవా మంత్రి రవి నాయక్ జీ మరణవార్త నన్ను కలచివేసింది. అనుభవజ్ఞుడైన పరిపాలనాదక్షుడిగా, గోవా అభివృద్ధికి పాటుపడిన అంకితభావం గల ప్రజాసేవకుడిగా ఆయన చిరకాలం గుర్తుండిపోతారు. ముఖ్యంగా అణగారిన వర్గాల సాధికారత కోసం ఆయన ఎంతో తపన పడ్డారు. ఈ విషాద సమయంలో ఆయన కుటుంబ సభ్యులకు, మద్దతుదారులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను' అని ప్రధాని నరేంద్ర మోడీ ఎక్స్ వేదికగా తన సంతాప సందేశాన్ని వెల్లడించారు.
గోవా సీఎం ప్రమోద్ సావంత్ కూడా రవి నాయక్ మృతిపై సంతాపం ప్రకటించారు. 'మా సీనియర్ నేత, కేబినెట్ మంత్రి రవి నాయక్ మరణం తీవ్రంగా బాధించింది. ముఖ్యమంత్రిగా, మంత్రిగా అనేక కీలక శాఖల్లో ఆయన దశాబ్దాల పాటు అందించిన సేవలు రాష్ట్రంపై చెరగని ముద్ర వేశాయి. ఆయన నాయకత్వం, వినయం, ప్రజా సంక్షేమానికి చేసిన కృషి ఎప్పటికీ గుర్తుండిపోతాయి' అని పేర్కొన్నారు.