సోమవారం, 8 డిశెంబరు 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 7 డిశెంబరు 2025 (16:29 IST)

ముఖ్యమంత్రి అభ్యర్థిగా సిద్ధూ పేరును ప్రకటించాలి : నవజ్యోతి కౌర్ సిద్ధూ

navjyoth singh siddhu
భారత క్రికెట్ జట్టు మాజీ క్రికెటర్, క్రికెట్ కామెంటేటర్, నవజ్యోత్ సింగ్ సిద్ధూ పేరును ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించాలని ఆయన సతీమణి నవజ్యోత్ కౌర్ సిద్ధూ అన్నారు. దీనిపై ఆమె మాట్లాడుతూ, తన భర్త తిరిగి రాజకీయాల్లో క్రియాశీలకంగా పనిచేస్తారని తెలిపారు. 
 
రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో పంజాబ్‌ కాంగ్రెస్‌ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటిస్తే రాజకీయాల్లో చురుగ్గా పాల్గొంటారని ఆయన సతీమణి నవ్‌జోత్‌ కౌర్‌ సిద్ధూ పేర్కొన్నారు. ఏ పార్టీకి చెల్లించేందుకు తమ వద్ద నిధులు లేవని ఆమె వెల్లడించారు. కానీ, తాము అధికారంలోకి వస్తే మాత్రం పంజాబ్‌ను బంగారు రాష్ట్రంగా మారుస్తామని వెల్లడించారు. 
 
'మేము ఎప్పుడూ పంజాబ్‌, పంజాబియత్‌ కోసం గళం విప్పుతాం. కానీ, ముఖ్యమంత్రి సీట్లో కూర్చోవడానికి రూ.500 కోట్లు చెల్లించే స్థోమత లేదు' అంటూ వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి దిగజారడంపై గవర్నర్‌ గులాబ్‌ చంద్‌ కటారియాను కలిసిన అనంతరం కౌర్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. 
 
అయితే.. తమను డబ్బు ఎవరు డిమాండ్‌ చేశారో మాత్రం వెల్లడించలేదు. 'రూ.500 కోట్లు ఇచ్చిన వ్యక్తి మాత్రం సీఎం అవుతాడు' అని వ్యాఖ్యానించారు. సిద్ధూకు ఏ పార్టీ అవకాశం ఇచ్చినా.. రాష్ట్రం అభివృద్ధి కోసం పనిచేస్తారని వెల్లడించారు.