మంగళవారం, 19 ఆగస్టు 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్

ఉపరాష్ట్రపతి ఎన్నికలు : ఇండియా కూటమి అభ్యర్థిగా జస్టిస్ బి.సుదర్శన్ రెడ్డి

sudarshan reddy
భారత ఉపరాష్ట్రపతి ఎన్నికలు త్వరలోనే జరుగనున్నాయి. ఈ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి తరపున మహారాష్ట్ర గవర్నర్, తమిళనాడు రాష్ట్ర వాసి సీపీ రాధాకృష్ణన్ పేరును ఎంపిక చేశారు. అయితే, కాంగ్రెస్ సారథ్యంలోని ఇండియా కూటమి అభ్యర్థిగా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ బి.సుదర్శన్ రెడ్డిని ఎంపిక చేసినట్టు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే వెల్లడించారు. జస్టిస్ సుదర్శన్ రెడ్డికి తమ కూటమిలోని అన్ని పార్టీలు మద్దతు తెలిపాయని ఆయన వెల్లడించారు.
 
ఇదే అంశంపై ఖర్గే మాట్లాడుతూ, దేశంలోని ప్రఖ్యాత న్యాయనిపుణుల్లో బి.సుదర్శన్ రెడ్డి ఒకరు. ఏపీ, గౌహతి హైకోర్టులతో పాటు సుప్రీంకోర్టులో సేవలు అందించారు. సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయంపై స్పష్టమైన అవగాహన కలిగి వ్యక్తి. ఉమ్మడి అభ్యర్థిని నిలబెట్టాలని ఇండియా కూటమిలోని పార్టీలన్నీ ఓ అభిప్రాయానికి వచ్చి ఏకగ్రీవంగా ఈ నిర్ణయం తీసుకున్నాయి అని ఖర్గే పేర్కొన్నారు. ప్రతిపక్షాలన్నీ ఒకే పేరును అంగీకరించడం ఎంతో సంతోషంగా ఉందని, ఇది ప్రజాస్వామ్యానికి అతిపెద్ద విజయమని చెప్పారు. 

ముంబై కుండపోత వర్షాలు - 250 విమాన సర్వీసులు రద్దు 
 
దేశ వాణిజ్య రాజధాని ముంబై మహానగరంలో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. గత కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో రోడ్లు, రైల్వే లైన్లు, దిగువ ప్రాంతాలు నీటితో నిండిపోయాయి. ఈ కారణంగా భారత వాతావరణ సంస్థ (ఐఎండీ) రెడ్‌ అలర్ట్‌ జారీ చేసింది. వాతావరణం అనుకూలంగా లేనందున ముంబైలోని ఛత్రపతి శివాజీ మహరాజ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

దీనివల్ల దాదాపు 250కి పైగా విమాన సర్వీసులపై ప్రభావం పడినట్లు అధికారులు పేర్కొన్నారు. ఉదయం 9 గంటల నుంచి 9.50 గంటల ప్రాంతంలో 8 విమానాలను దారి మళ్లించినట్లు తెలిపారు. విమాన సర్వీసులు సగటున 45 నిమిషాల పాటు ఆలస్యంగా నడుస్తున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు ఎయిర్‌పోర్టు ప్రయాణికులకు అడ్వైజరీ జారీ చేసింది. విమానాల సమయాలను సంబంధిత వెబ్‌సైట్లలో చెక్‌ చేసుకోవాలని సూచించింది.
 
పలు విమానయాన సంస్థలు ప్రయాణికులకు అడ్వైజరీ జారీ చేశాయి. వరదల కారణంగా కిలోమీటర్ల మేర ట్రాఫిక్‌ నిలిచిపోవడంతో ముందుగానే ఇళ్ల నుంచి బయల్దేరాలని సూచించాయి. మరోవైపు భారీ వరదలకు రైలు పట్టాలు నీట మునిగిపోవడంతో ముంబై లోకల్ రైళ్లను రద్దు చేసినట్లు రైల్వే అధికారులు పేర్కొన్నారు. 
 
భారీ వర్షాల కారణంగా పాఠశాలలు, కళాశాలలు, పలు ప్రభుత్వ కార్యాలయాలకు రాష్ట్ర ప్రభుత్వం సెలవు ప్రకటించింది. ప్రైవేటు ఉద్యోగులు వర్క్‌ఫ్రం హోం చేసుకోవాలని సూచించింది. అవసరమైతే తప్ప ప్రజలకు బయటకురావద్దని ముంబై మున్సిపల్‌ కార్పొరేషన్‌ (బీఎంసీ) విజ్ఞప్తి చేసింది.
 
గత 24 గంటల్లో, నగరంలోని అనేక ప్రాంతాల్లో 200 మి.మీ కంటే ఎక్కువ వర్షపాతం నమోదైనట్లు భారత వాతావరణ శాఖ తెలిపింది. విఖ్రోలి ప్రాంతంలో అత్యధికంగా 255.5 మి.మీ వర్షపాతం నమోదైనట్లు పేర్కొంది. భారీ వర్షపాతం కారణంగా గంటకు 40-50 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయని.. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.