సోమవారం, 29 సెప్టెంబరు 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 12 సెప్టెంబరు 2025 (20:11 IST)

ప్రభుత్వ పరిహారం కోసం.. భర్తను హత్య చేసి పులిపై నెపం వేసిన భార్య

tiger
తన భర్తను హత్య చేస్తే ప్రభుత్వం భారీగా పరిహారం ఇస్తుందని భావించిన ఓ వివాహిత తన భార్యను హత్య చేసింది. ఆ నెపాన్ని మాత్రం పులిపై వేసింది. పులి దాడి చేయడం వల్ల తన భర్త చనిపోయాడంటూ పోలీసులను నమ్మించే ప్రయత్నం చేసింది. ఈ దారుణం కర్నాటక రాష్ట్రంలోని మైసూరు జిల్లాలో శుక్రవారం వెలుగు చూసింది. ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
హుణసూరు తాలూకా పరిధిలోని చిక్కహెజ్జూరు గ్రామానికి చెందిన వెంకటస్వామి (45), సల్లాపురి అనే దంపతులు ఉన్నారు. వీరు పోక తోటల్లో కూలీలుగా పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. కొద్ది రోజుల క్రితం వీరి గ్రామంలో పులి సంచరించిటన్టు పుకార్లు వ్యాపించాయి. ఇదే అదునుగా భావించిన సల్లాపురి తన భర్తను హత్య చేసి పరిహారం పొందాలని పథకం వేసింది. 
 
తన పథకంలో భాగంగా, ముందుగా అనుకున్న ప్లాన్ ప్రకారం తన భర్త కనిపించడం లేదని, పులి దాడి చేసి లాక్కెళ్లిపోయివుంటుందని తమ గ్రామంలోని వారందరినీ నమ్మించే ప్రయత్నం చేసింది. దీంతో పోలీసులు, అటవీశాఖ అధికారులు కలిసి ఆ తోటల్లో గాలించారు. వర్షం పడుతుండటంతో వారికి పులి అడుగుల జాడ కనిపించలేదు. దీంతో అనుమానం వచ్చిన అధికారులు ఆమె ఇంటి పరిసరాల్లోనే ముమ్మరంగా గాలించారు. ఈ క్రమంలో ఇంటి వెనుక ఉన్న పేడకుప్పలో వెంకటస్వామి మృతదేహాన్ని గుర్తించారు. 
 
మృతదేహం దొరకడంతో పోలీసులు సల్లాపురిని అదుపులోకి తీసుకుని తమదైనశైలిలో విచారించగా, అసలు నిజం అంగీకరించనట్టయింది. వన్యప్రాణుల దాడిలో చనిపోతే ప్రభుత్వం రూ.15 లక్షల పరిహారం ఇస్తుందని పోక తోటలో పని చేస్తుంటే ఎవరో మాట్లాడుకోవడాన్ని విన్నానని, ఆ డబ్బు కోసమే ఈ హత్య చేసినట్టు ఆమె అంగీకరించింది. ఆహారంలో విషం కలిపి చంపేసిన తర్వాత శవాన్ని పేడకుప్పలో దాచిపెట్టినట్టు వివరించింది. ఈ ఘటనపై హుణసూరు గ్రామీణ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.