బుధవారం, 5 నవంబరు 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 4 నవంబరు 2025 (11:06 IST)

Prakash Raj: మమ్ముట్టిలాంటి గొప్ప నటుడికి అలాంటి అవార్డులు అవసరం లేదు.. ప్రకాశ్ రాజ్

Prakash Raj
జాతీయ చలన చిత్ర అవార్డుల ప్రక్రియపై సినీ నటుడు ప్రకాశ్ రాజ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కేరళ అవార్డుల జ్యూరీ ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించడం తనకు ఎంతో సంతోషాన్నిచ్చిందని ప్రకాశ్ రాజ్ తెలిపారు. ప్రస్తుత జాతీయ అవార్డుల విధానాన్ని ప్రకాశ్ రాజ్ తప్పుబట్టారు. 
 
ఈ జాతీయ అవార్డులు కొందరికే పరిమితం అవుతున్నాయి. మంజుమ్మెల్ బాయ్స్, భ్రమయుగం వంటి గొప్ప చిత్రాలకు పురస్కారాలు దక్కడం లేదు. ఇలాంటి జ్యూరీ, ఇలాంటి ప్రభుత్వ విధానాలు ఉన్నప్పుడు.. మమ్ముట్టిలాంటి గొప్ప నటుడికి అలాంటి అవార్డులు అవసరం లేదని ప్రకాశ్ రాజ్ ఘాటుగా వ్యాఖ్యానించారు. 
 
కేరళ అవార్డుల జ్యూరీ ఛైర్మన్‌గా తనను పిలిచినప్పుడు.. ఈ ప్రక్రియలో తాము జోక్యం చేసుకోబోమని, అనుభవజ్ఞుడైన బయటి వ్యక్తిగా పూర్తి నిర్ణయాధికారం మీకే ఉంటుందని స్పష్టంగా చెప్పారు. కానీ జాతీయ అవార్డుల విషయంలో అలా జరగడం లేదు. అది మనం కళ్లారా చూస్తూనే ఉన్నామని వెల్లడించారు. 
 
ఈ సందర్భంగా ఆయన చిత్ర పరిశ్రమకు ఒక విజ్ఞప్తి చేశారు. దర్శకులు, రచయితలు కేవలం పెద్దలు, యువతను మాత్రమే కాకుండా పిల్లలను కూడా సమాజంలో భాగంగా గుర్తించాలని సూచించారు. పిల్లల కోసం మరిన్ని మంచి చిత్రాలు తీయడం గురించి ఆలోచించాలని కోరారు.
 
మరోవైపు ప్రముఖ బాలీవుడ్ నటుడు పరేశ్ రావల్ సినీ అవార్డులపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రతిష్ఠాత్మక జాతీయ పురస్కారాల నుంచి ఆస్కార్ అవార్డుల వరకు అన్నింట్లోనూ లాబీయింగ్ జరుగుతుందని, దీనికి ఏ పురస్కారాలూ మినహాయింపు కాదని ఆయన అభిప్రాయపడ్డారు. నటీనటులకు అవార్డులు, ట్రోఫీల కన్నా దర్శక నిర్మాతల నుంచి వచ్చే ప్రశంసలే అత్యంత విలువైనవని స్పష్టం చేశారు.