Uttarkashi: భారీ వర్షాలు- ఉత్తరకాశిలో ఒక గ్రామమే కొట్టుకుపోయింది.. నివాసితులు గల్లంతు (video)
ఉత్తరాఖండ్‌లో భారీ వర్షాలతో వరదలు ముంచెత్తుతున్నాయి. ఉత్తరాఖండ్, ఉత్తరకాశి జిల్లాలోని హర్సిల్ సమీపంలోని ధరాలి ప్రాంతంలో మంగళవారం భారీ వరదలకు ఒక గ్రామం కొట్టుకుపోయి, అనేక మంది నివాసితులు గల్లంతైనట్లు తెలుస్తోంది.
ముఖ్యంగా ధరాలి సమీపంలోని ఖీర్ గఢ్‌లో నీటి మట్టాలు అకస్మాత్తుగా పెరిగిన తరువాత, స్థానిక మార్కెట్ ప్రాంతంలో పెద్ద ఎత్తున నష్టం సంభవించిందని, పోలీసులు, అగ్నిమాపక శాఖ, రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన దళం, భారత సైన్యం వెంటనే స్పందించాయి.
ఉత్తరాకాశిలోని ధరాలిలోని ఖీర్ గఢ్‌లో నీటి మట్టాలు పెరగడంతో, ధరాలి మార్కెట్ ప్రాంతంలో నష్టం జరిగినట్లు నివేదికలు అందాయి. నది ఒడ్డున సురక్షితమైన దూరం పాటించాలని, పిల్లలు మరియు పశువుల భద్రతను నిర్ధారించాలని అధికారులు స్థానికులను కోరారు.
ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి ఈ విపత్తుపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు జరుగుతున్నాయని హామీ ఇచ్చారు.
కాగా, ఆగస్టు 4 నుండి ఉత్తరకాశి, పౌరి గర్హ్వాల్, తెహ్రీ, చమోలితో సహా ఉత్తరాఖండ్‌లోని కొన్ని ప్రాంతాలలో అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ (IMD) హెచ్చరిక జారీ చేసింది.
హెచ్చరిక దృష్ట్యా, డెహ్రాడూన్ జిల్లా యంత్రాంగం ఆగస్టు 4న 12వ తరగతి వరకు ఉన్న అన్ని పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలను మూసివేయాలని ఆదేశించింది.