గురువారం, 21 ఆగస్టు 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 18 ఆగస్టు 2025 (12:56 IST)

మరింతగా ముదరనున్న ఓట్ల చోరీ కేసు : సీఈసీపై విపక్షాల అభిశంసన!?

gyanesh kumar
ఓట్ల చోరీ జరిగిందంటూ ఆరోపిస్తూ ఎన్నికల సంఘం లక్ష్యంగా అనేక రాజకీయ పార్టీలు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నాయి. అయితే, ఈ విమర్శలను కేంద్ర ఎన్నికల సంఘం తోసిపుచ్చడంతో పాటు విపక్షాలపై ఎదురుదాడికి దిగింది. ఈనేపథ్యంలో ప్రధాన ఎన్నికల కమిషనర్‌(సీఈసీ) జ్ఞానేశ్‌ కుమార్‌‌పై అభిశంసనకు సిద్ధమవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి 
 
దానికి సంబంధించి నోటీసును తీసుకువచ్చేందుకు ప్రతిపక్ష సభ్యులు యోచన చేస్తున్నారని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ఆ వ్యవహారంపై తాము త్వరలో నిర్ణయం తీసుకుంటామని కాంగ్రెస్ ఎంపీ ఇమ్రాన్‌ ప్రతాప్‌గఢీ మీడియాకు వెల్లడించారు. సీఈసీని తొలగించాలంటే పార్లమెంట్ ఉభయ సభల్లో మూడింట రెండొంతుల మెజార్టీ అవసరం. అయితే ప్రతిపక్షాలకు పార్లమెంట్‌లో అంతమంది సభ్యులు లేరు.
 
మరవైపు, ఓట్ల చోరీపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ ఆందోళన కార్యక్రమం మొదలుపెట్టిన నేపథ్యంలో జ్ఞానేశ్‌ కుమార్‌ ఆదివారం ఎన్నికల కమిషనర్లు సుఖ్బీర్‌సింగ్‌ సంధు, వివేక్‌జోషీతో కలిసి మీడియాతో మాట్లాడారు. ఆ ఆరోపణలకు గట్టిగా కౌంటర్ ఇచ్చారు. తన ఆరోపణలపై కాంగ్రెస్‌ ఎంపీ తగిన ఆధారాలనైనా సమర్పించాలని, లేదంటే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. 
 
ఆయన వద్ద ఆధారాలు ఉంటే వారం రోజుల్లో ప్రమాణపత్రం రూపంలో సంతకంతో సమర్పించాలని అల్టిమేటం జారీ చేసింది. అలా చేయనిపక్షంలో ఆరోపణల్ని నిరాధారంగా పరిగణిస్తామని స్పష్టం చేశారు. ఈసీ భుజాలపై తుపాకీ పెట్టి ఓటర్లను లక్ష్యంగా చేసుకొని రాజకీయాలు చేసేవారి ఆటలు సాగవని తేల్చిచెప్పారు. ఈ నేపథ్యంలోనే అభిశంసన వార్తలు వస్తున్నాయి.