శుక్రవారం, 10 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. వార్తలు
Written By ఠాగూర్

జనవరి 10 నుంచి 19 వరకు వైకుంఠద్వార దర్శనాలు : తితిదే వెల్లడి

venkateswara swamy
వచ్చే యేడాది జనవరి నెల 10వ తేదీ నుంచి 19వ తేదీ వరకు వైకుంఠద్వార దర్శనాలు కల్పించేందుకు వీలుగా చేపట్టాల్సిన చర్యలపై తితిదే అదనపు ఈవో వెంకయ్య చౌదరి సోమవారం తితిదే అధికారులతో ఒక సమీక్షా సమావేశం నిర్వహించారు. 
 
తిరుమలలోని అన్నమయ్య భవనంలో వివిధ విభాగాల అధికారులతో ఆయన ఈ సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకయ్య చౌదరి మాట్లాడుతూ, జనవరి 10న వైకుంఠ ఏకాదశి కావడంతో ఆ రోజు నుంచి 19వ తేదీ వరకు వైకుంఠ ద్వార దర్శనాలను భక్తులకు కల్పించనున్నట్టు తెలిపారు. ఈ 10 రోజుల పాటు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు (స్వయంగా వచ్చే ప్రొటోకాల్ ప్రముఖులకు మినహా) చేసినట్టు అదనపు ఈవో వెంకయ్య చౌదరి వెల్లడించారు. 
 
అలాగే, చంటిబిడ్డలు, వృద్ధులు, దివ్యాంగులు, డిఫెన్స్, ఎస్ఆర్ఎ దర్శనాలతో పాటు అర్జితసేవలు రద్దు చేస్తున్నట్లు చెప్పారు. ఆ రోజుల్లో వెంగమాంబ అన్నప్రసాద కేంద్రంలో ఉదయం 6 నుంచి అర్థరాత్రి 12 గంటల వరకు అన్నప్రసాదాల వితరణ చేయాలని అధికారులకు సూచించారు. వైకుంఠ ద్వార దర్శనాల్లో సాధారణ భక్తులకే ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. సాధారణ భక్తులకు ఎక్కువ దర్శన సమయం కల్పించేలా జారీ చేయాల్సిన టికెట్ల కోటా, ఇతర అంశాలపై మరో రెండు వారాల్లో ఇంకోసారి సమీక్షిస్తామని పేర్కొన్నారు.