బుధవారం, 8 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 8 జనవరి 2025 (09:02 IST)

అవి ఉన్నవారికే వైకుంఠ ద్వార దర్శనం : తితిదే ఈవో శ్యామల రావు

venkateswara swamy
టికెట్లు, టోకెన్లు ఉన్నవారికే వైకుంఠద్వార దర్శనానికి అనుమతి ఇస్తామని తితిదే ఈవో శ్యామల రావు వెల్లడించారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఏడు లక్షల మందికి తిరుమలలో ఈ నెల 10 నుంచి వైకుంఠద్వార దర్శనాలు కల్పించేలా ప్రణాళికలు రూపొందించినట్టు తెలిపారు. ముందస్తు టికెట్లు, టోకెన్లు ఉన్న భక్తులకే వైకుంఠ ద్వార దర్శనం ఉంటుందని చెప్పారు. టికెట్లు లేనివారు తిరుమల రావచ్చు కానీ దర్శనానికి అనుమతి లేదని స్పష్టం చేశారు. నిర్దేశించిన తేదీ, సమయానికి మాత్రమే భక్తులు క్యూలైన్లలో ప్రవేశించాలని విజ్ఞప్తి చేశారు. 
 
ఏకాదశి రోజున వేకువజాము ధనుర్మాస కైంకర్యాలు పూర్తయిన తర్వాత 4.30 గంటలకు ప్రొటోకాల్ దర్శనాలు మొదలవుతాయని, 8 గంటల నుంచి సర్వదర్శన భక్తులను అనుమతిస్తామని వివరించారు. అదేరోజు ఉదయం 9 గంటలకు స్వర్ణరథోత్సవం, 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటలకు వరకు వాహనమండపంలో మలయప్ప స్వామి దర్శనం ఉంటుందని తెలి పారు. మరుసటిరోజు ఉదయం 5.30 గంటలకు పుష్కరిణిలో చక్రస్నానం నిర్వహిస్తామన్నారు. 
 
ఈ 10 రోజుల దర్శనాలకు సంబంధించిన రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు ఇప్పటికే ఆన్‌లైన్ ద్వారా 1.40 లక్షలు, 19500 శ్రీవాణి టికెట్లను జారీ చేశామని చెప్పారు. సామాన్య భక్తుల కోసం తిరుపతిలో 8 ప్రాంతాలతో పాటు తిరుమల స్థానికుల కోసం కొండ పైన మొత్తం 94 కౌంటర్ల ద్వారా మొత్తం 4.32 లక్షల ప్లాటెడ్ సర్వదర్శన టోకెన్లు జారీ చేస్తామని ఈవో వివరించారు. 
 
ఈ నెల 10, 11, 12వ తేదీలకు సంబంధించిన 120 లక్షల టోకెన్లను 8వ తేదీ ఉదయం 5 గంటలకు, ఆ తర్వాత రోజులకు సంబంధించిన టోకెన్లను ఏరోజుకారోజు విష్ణునివాసం, శ్రీనివాసం, భూదేవి కాంప్లెక్స్ ద్వారా జారీ చేస్తామన్నారు. ఈ రోజుల్లో సిఫారసులు, వృద్ధులు, దివ్యాంగులు, చంటిబిడ్డల తల్లిదండ్రులు వంటి ప్రత్యేక దర్శనాలేవీ ఉండబోవని స్పష్టం చేశారు. సమావేశంలో అదనపు ఈవో వెంకయ్య చౌదరి, ఎస్సీ సుబ్బరాయుడు పాల్గొన్నారు.