కరీంనగర్‌లో సామూహిక అత్యాచారం.. వాట్సాప్ గ్రూపుల్లో వీడియో వైరల్
కరీంనగర్ జిల్లా కొత్తపల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో ఘోరం చోటుచేసుకుంది. ఓ బాలికపై ఇద్దరు యువకులు అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం ఈ దుశ్చర్యను వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశారు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.
వివరాల్లోకి వెళితే.. కరీంనగర్ జిల్లా, కొత్తపల్లి మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలికపై అదే గ్రామానికి చెందిన ఇద్దరు యువకులు లైంగిక దాడికి పాల్పడ్డారు. అక్కడితో ఆగకుండా అత్యాచారాన్ని సెల్ ఫోన్‌లో చిత్రీకరించి, సోషల్ మీడియాలో వైరల్ చేశారు.
ఆ ఇద్దరు యువకులు కొంతకాలంగా బాలికతో సన్నిహితంగా ఉంటున్నట్లు తెలుస్తోంది. వారు మత్తు పదార్థాలకు అలవాటు పడటంతో పాటు ఆమెకు కూడా అలవాటు చేసినట్టు తెలుస్తుంది.
వారం రోజుల క్రితం ముగ్గురు కలిసి నిర్మానుష్య ప్రదేశానికి వెళ్లారు. ఆ తర్వాత ఒకరి తర్వాత ఒకరు బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డారు. లైంగిక దాడి సమయంలో వీడియో చిత్రీకరించారు.
అనంతరం మూడు రోజుల క్రితం ఈ వీడియోలను స్థానిక వాట్సాప్ గ్రూపుల్లో పోస్టు చేశారు. ఈ ఘటనపై తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.