శుక్రవారం, 3 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 2 జనవరి 2025 (10:49 IST)

నోటీసులు ఇవ్వకుండానే అలాంటి భవనాలు కూల్చివేయొచ్చు : హైడ్రా కమిషనర్

ranganath
నీటి వనరులను ఆక్రమించుకుని నిర్మించుకున్న భవనాలకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే కూల్చివేయొచ్చని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ తెలిపారు. బుధవారం హైడ్రా సిబ్బంది హైదరాబాద్ నగర శివారు ప్రాంతంలోని ఖాజాగూడ భగీరథమ్మ చెరువు వద్ద చేపట్టిన కూల్చివేతలను స్వయంగా పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన ఎఫ్ఎఎల్ పరిధిలోని అక్రమ నిర్మాణాల కూల్చివేతలపై వివరణ ఇచ్చారు. తాము నిబంధనలు పాటిస్తూనే అక్రమ నిర్మాణాలను కూల్చివేశామన్నారు.
 
నీటి వనరుల్లోని నిర్మాణాలను ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే కూల్చివేసే హక్కు ఉందన్నారు. ఇటీవల సుప్రీంకోర్టు డివిజన్ బెంచ్ కూడా ఇదే అంశంపై తీర్పు ఇచ్చిందని గుర్తు చేశారు. జస్టిస్ గవాయ్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు డివిజన్ బెంచ్ తీర్పు ఇచ్చిందన్నారు. చట్టాలను పాటిస్తూనే... కోర్టులను గౌరవిస్తూనే తాము ఆక్రమణలను తొలగిస్తున్నామన్నారు.
 
బఫర్ జోన్, ఎఫ్ఎఎల్‌లోని నిర్మాణాలనే తొలగించామని రంగనాథ్ వెల్లడించారు. నోటీసులు ఇవ్వకుండానే కూల్చవచ్చని... కానీ మానవతా దృక్పథంతో 24 గంటల్లో ఖాళీ చేయాలని నోటీసులు ఇచ్చినట్లు చెప్పారు. నోటీసులు ఇచ్చాక కూడా 24 గంటల్లో ఖాళీ చేయనందునే కూల్చివేశామన్నారు. 
 
ఖాజాగూడలోని బ్రాహ్మణకుంట ప్రాంతంలో ఆక్రమణల తొలగింపులో హైడ్రా వ్యవహరించిన తీరుపై హైకోర్టు మంగళవారం నాడు ఆగ్రహం వ్యక్తం చేసింది. 
 
నోటీసులు ఇచ్చి 24 గంటలు కూడా గడవకముందే ఎలా కూల్చివేస్తారని ప్రశ్నించింది. ఇలాగే చేస్తే హైద్రా కమిషనర్‌‌ను కోర్టుకు పిలవాల్సి ఉంటుందని హెచ్చరించింది. హైకోర్టు వ్యాఖ్యల నేపథ్యంలో హైడ్రా కమిషనర్ వివరణ ఇచ్చారు.