శుక్రవారం, 10 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : సోమవారం, 4 నవంబరు 2024 (16:51 IST)

బాలకృష్ణ గారు నిజంగానే అన్ స్టాపబుల్. ఆయన ఎనర్జీ మ్యాచ్ చేయడం కష్టం : దుల్కర్ సల్మాన్

Dulquer Salmaan
Dulquer Salmaan
'లక్కీ భాస్కర్'తో హ్యాట్రిక్ విజయాన్ని సాధించి, తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చెరగని స్థానాన్ని సంపాదించుకున్నారు దుల్కర్ సల్మాన్. సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య 'లక్కీ భాస్కర్' చిత్రాన్ని నిర్మించారు. ప్రతిభగల దర్శకుడు వెంకీ అట్లూరి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మీనాక్షి చౌదరి కథానాయిక. జి.వి. ప్రకాష్ కుమార్ సంగీత దర్శకుడు. దీపావళి కానుకగా థియేటర్లలో విడుదలైన 'లక్కీ భాస్కర్', అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తూ సంచలన వసూళ్లతో దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో తాజాగా మీడియాతో ముచ్చటించిన కథానాయకుడు దుల్కర్ సల్మాన్ పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
 
లక్కీ భాస్కర్ చేయడానికి కారణం?
వెంకీ కథ చెబుతున్నప్పుడు, ఫస్ట్ హాఫ్ వినగానే ఈ సినిమా ఖచ్చితంగా చేయాలి అనుకున్నాను. బ్యాంకింగ్ నేపథ్యాన్ని తీసుకొని మధ్యతరగతి కుటుంబ కథ చెప్పడం కొత్తగా అనిపించింది. నేను ఎప్పటినుంచో వాస్తవానికి దగ్గరగా ఉండే ఒక మధ్యతరగతి తండ్రి పాత్ర చేయాలి అనుకుంటున్నాను. అది ఈ సినిమాతో నెరవేరింది. నా దృష్టిలో ఇది వాస్తవ కథ. బ్యాక్ గ్రౌండ్ లో హర్షద్ మెహతా లాంటివాడు భారీ స్కాం చేస్తుంటే, ఒక చిన్న బ్యాంక్ ఉద్యోగి తన పరిధిలో స్కాం చేయడం అనేది కొత్త పాయింట్. ఇది బ్యాంకింగ్ నేపథ్యమున్న సినిమా కావడంతో వెంకీ ఎంతో రీసెర్చ్ చేశాడు. బ్యాంకింగ్ సెక్టార్ కి చెందినవారు కూడా ఇందులో ఎటువంటి తప్పులు లేవని చెప్పడం విశేషం.
 
లక్కీ భాస్కర్ పాత్రలో నెగటివ్ షేడ్స్ ఉన్నాయి కదా.. ఎలాంటి వర్క్ చేశారు?
ప్రత్యేకంగా ఏమీ చేయలేదు. నటుడిగా అన్నిరకాల పాత్రలు చేయాలి. షారుఖ్ ఖాన్ లాంటివారు కూడా నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలు చేశారు. మనలోని నటుడిని బయటకు తీసుకురావాలంటే ఇలాంటి విభిన్న పాత్రలు చేయాలి. భాస్కర్ పాత్రలో ఎన్నో ఎమోషన్స్ ఉన్నాయి. నటుడిగా ఇలాంటి పాత్రలు సంతృప్తిని ఇస్తాయి.
 
షూటింగ్ లో ఏమైనా ఛాలెంజ్ లు ఎదురయ్యాయా?
ఛాలెంజింగ్ గా అనిపించలేదు. ప్రతి రోజూ, ప్రతి సన్నివేశం చేయడాన్ని ఆస్వాదించాను. ప్రతి దశలో ఎంజాయ్ చేశాను. ఈ సినిమా ఎంతో సంతృప్తిని ఇచ్చింది.
 
తెలుగులో హ్యాట్రిక్ విజయాలు సాధించడం ఎలా ఉంది?
ప్లాన్ చేస్తే విజయాలు రావు. అందరం మంచి కథలు చెప్పాలి, మంచి సినిమాలు చేయాలనే అనుకుంటాం. అలాగే ముందుకు వెళ్తున్నాను. కష్టానికి తగ్గ ఫలితం దక్కడం సంతోషంగా ఉంది.
 
బ్యాంకింగ్ సబ్జెక్టు అంటే సామాన్యులకు అర్థమవుతుందా లేదా అనే సందేహం కలగలేదా?
ఈరోజుల్లో బ్యాంక్ అకౌంట్ అనేది దాదాపు అందరికీ ఉంటుంది. పైగా ఇందులో భాస్కర్ సైడ్ బిజినెస్ లా.. చదువురాని వారికి ఫామ్స్ నింపడం లాంటివి చేస్తుంటాడు. అలాంటి సన్నివేశాలు చాలామందికి కనెక్ట్ అవుతాయి. ఈ సినిమాని అందరికీ అర్థమయ్యేలా వెంకీ చాలా బాగా తీశారు.
 
సినిమాలో చూపించినట్టుగా మిడిల్ క్లాస్ వారికి లాటరీ అనేది డ్రీమ్.. మీరు నిజ జీవితంలో లాటరీ టికెట్ కొన్నారా?
మమ్ముట్టి గారి కొడుకుని అయినప్పటికీ, నేనూ సాధారణ యువకుల్లాగానే ఆలోచిస్తాను. యువకుడిగా ఉన్నప్పుడు లాటరీ తగిలితే, సొంతంగా నాకు నచ్చినవన్నీ కొనుక్కోవచ్చు అని కలలు కనేవాడిని.
 
జి.వి. ప్రకాష్ సంగీతం గురించి?
కథకి తగ్గట్టుగా, ప్రతి ఎమోషన్ ని ప్రేక్షకులు ఫీలయ్యేలా అద్భుతమైన సంగీతం అందించారు.
 
లక్కీ భాస్కర్ సినిమా చూసి మీ తండ్రి మమ్ముట్టి గారి స్పందన ఏంటి?
నాతో ఏం చెప్పలేదు. కానీ, దర్శకుడు వెంకీతో మాట్లాడి ప్రత్యేకంగా అభినందించారు.
 
మమ్ముట్టి గారికి, మీకు మధ్య సినిమాలకు సంబంధించిన చర్చలు జరుగుతాయా?
ఏదైనా కొత్త కథ విని నచ్చితే, ఇద్దరం దాని గురించి మాట్లాడుకుంటాం. నాకు బాగా నచ్చిన కథల గురించి ఆయనకు చెబుతుంటాను. మమ్ముట్టి గారు పలు తెలుగు సినిమాలలో నటించారు. నేను తెలుగు సినిమా చేసే ముందు, ఆయనకు చెప్తే.. బ్యూటిఫుల్ ల్యాంగ్వేజ్ అని చెప్పారు.
 
తెలుగు ప్రేక్షకుల గురించి?
తెలుగు ప్రేక్షకుల ప్రేమ చూసి మొదట నేను ఆశ్చర్యపోయాను. మహానటికి ముందు మలయాళ ప్రేక్షకులకు, కొంతవరకు తమిళ ప్రేక్షకులకు తెలుసు. మహానటి నుంచి తెలుగు ప్రేక్షకులు ఎంతో ప్రేమ చూపిస్తున్నారు. సీతారామం చేయడానికి ఎక్కువ గ్యాప్ తీసుకున్నప్పటికీ, ఆ ప్రేమ పెరిగింది తప్ప తగ్గలేదు.
 
బాలకృష్ణ గారి అన్ స్టాపబుల్ షోలో పాల్గొనడం ఎలా ఉంది?
బాలకృష్ణ గారు నిజంగానే అన్ స్టాపబుల్. ఆయన ఎనర్జీ మ్యాచ్ చేయడం కష్టం. బాలకృష్ణ గారు ఆరోజు 12 గంటలకు పైగా షూటింగ్ లో పాల్గొన్నారు. అయినప్పటికీ చివరివరకు అదే ఎనర్జీతో ఉన్నారు.
 
మీకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్?
మీడియా నుంచే వచ్చింది. సినిమా గురించి, నా నటన గురించి పాజిటివ్ రివ్యూలు రావడం సంతోషం కలిగించింది.
 
మీ డ్రీమ్ రోల్ ఏంటి?
అలా అని ఏమీ లేదు. అన్ని రకాల పాత్రలు చేయాలని ఉంది.
 
మీ రాబోయే సినిమాలు?
తెలుగులో 'ఆకాశంలో ఒక తార' సినిమా చేస్తున్నాను. అది కూడా ప్రేక్షకులకు ఒక కొత్త అనుభూతిని ఇస్తుంది.