బుధవారం, 19 ఫిబ్రవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 19 ఫిబ్రవరి 2025 (09:20 IST)

వచ్చే మూడేళ్లలో శ్రీవారి సేవలన్నీ ఆన్‌లైన్ డిజిటలైజేషన్ చేస్తాం: వెంకయ్య

Tirumala
తిరుమల తిరుపతి దేవస్థానం రాబోయే రెండు, మూడు సంవత్సరాలలో అన్ని ఆలయ సేవలను పూర్తిగా ఆన్‌లైన్ డిజిటలైజేషన్ చేయాలనే ప్రతిష్టాత్మక ప్రణాళికను ఆవిష్కరించింది. మంగళవారం జరిగిన అంతర్జాతీయ దేవాలయాల సమావేశం అండ్ ఎక్స్‌పో (ITCX) 2025లో టిటిడి అదనపు ఈఓ వెంకయ్య చౌదరి ఈ విషయాన్ని తెలిపారు. 
 
"ఇది పారదర్శకత, కార్యాచరణ సామర్థ్యాన్ని పెంచుతుంది. తిరుమలలోని కొండ ఆలయాన్ని సందర్శించే భక్తులకు మెరుగైన సేవలను అందిస్తుంది" అని వెంకయ్య చౌదరి అన్నారు. డిజిటల్ పరివర్తన ఆలయ పరిపాలన అన్ని అంశాలను కవర్ చేస్తుంది. దర్శన బుకింగ్‌లు, వసతి నిర్వహణ, లడ్డూ ప్రసాద పంపిణీతో సహా అన్నీ డిజిటలైజ్ కానున్నాయని చెప్పారు.
 
టీటీడీ దర్శన నిర్వహణ వ్యవస్థ సాధారణ యాత్రికులకు ప్రత్యేక సహాయంగా ఉండేలా రూపొందించబడిందని చౌదరి అన్నారు. "సాధారణ దర్శనం వారపు రోజులలో 12 నుండి 14 గంటలు, వారాంతాల్లో 15 నుండి 17 గంటల వరకు అందుబాటులో ఉంటుంది. 63 కంపార్ట్‌మెంట్లతో కూడిన వెయిటింగ్, క్యూ వ్యవస్థ రోజుకు 28,000 మంది యాత్రికులకు వసతి కల్పిస్తుందని వెల్లడించారు. ఇంకా 24 గంటలూ ఆహారం, పారిశుద్ధ్య సౌకర్యాలు కూడా మెరుగ్గా వుంటాయని చెప్పుకొచ్చారు. 
 
తిరుమలకు ఏటా 2.5 కోట్ల మంది యాత్రికులు వస్తారు. ప్రతిరోజూ దాదాపు 60,000 మంది యాత్రికులకు వసతి కల్పిస్తుంది. అదనంగా, మూడు ప్రత్యేక వంటశాలలలో తయారుచేసిన అన్నప్రసాదాన్ని సుమారు 80,000 మంది యాత్రికులు స్వీకరిస్తున్నారని చౌదరి వెల్లడించారు. 
 
ప్రతిరోజూ యాత్రికులకు 3.5 లక్షల లడ్డూ ప్రసాదాలతో సహా పది రకాల శ్రీవారి ప్రసాదాలను అందిస్తారు. టిటిడి 14 ఆసుపత్రులు, డిస్పెన్సరీలను నిర్వహిస్తుంది. తిరుపతి - తిరుమల మధ్య 1,600 RTC బస్సులు నడుస్తున్నాయి. ప్రత్యేక సందర్భాలలో అదనంగా 2,400 బస్సులు నడుస్తాయని ఆయన చెప్పుకొచ్చారు.